Madhya Pradesh: మూడో అంతస్తు నుంచి జారిపడినా.. మృత్యుంజయుడు ఈ చిన్నారి!
- ప్రాణాపాయం లేకుండా బయటపడిన వైనం
- బాల్కనీలో ఆడుకుంటుండగా ఘటన
- నడిచి వెళ్తున్న మహిళపై పడడంతో తప్పిన ప్రాణగండం
పట్టుమని రెండేళ్లు కూడా నిండని ఆ బాలుడు మృత్యువునే జయించాడు. మూడో అంతస్తు నుంచి కిందపడినా ప్రాణాపాయం లేకుండా బయటపడ్డాడు. బాలుడి కుటుంబ సభ్యులనే కాదు చూపరులను ఆశ్చర్యానికి గురిచేసిన ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... శివపురి పట్టణం రాఘవేంద్రనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్ మూడో అంతస్తులో ఒక కుటుంబం నివసిస్తోంది. ఆ ఇంట్లోని రెండేళ్ల చిన్నారి బాల్కనీలో ఆడుకుంటుండగా జారిపడిపోయాడు.
అంతెత్తు నుంచి పడడంతో అక్కడికక్కడే ప్రాణాలు పోవాల్సింది. కానీ బాలుడు పడిన సమయంలో కిందన ఓ మహిళ నడుచుకుంటూ వెళ్తోంది. సరిగ్గా బాలుడు ఆమెపై పడడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ విషయాన్ని కాసేపటి వరకు తల్లిదండ్రులు గమనించలేదు. ఒక్కసారిగా కలకలం రేగడంతో పడిపోయింది తమ బిడ్డేనని తెలియడంతో కుటుంబ సభ్యులు ఆందోళనతో కిందకు పరుగున వచ్చారు. స్పృహ కోల్పోయిన బాలుడిని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకువెళ్లారు.
‘వేగంగా నడుచుకుంటూ వెళ్తున్నాను. హఠాత్తుగా నాపై ఏదోపడినట్టు అనిపించడంతో ఉలిక్కిపడ్డాను. అంతలోనే చిన్నబాబు నా ముందు పడడంతో ఆశ్చర్యపోయాను. వెంటనే అతన్ని ఎత్తుకుని చూసేసరికి స్పృహతప్పి ఉన్నాడు. అంతెత్తు నుంచి బాలుడు పడడంతో నాకు కూడా కనిపించని గాయం అయింది. కానీ బాలుడు ప్రాణాలతో బయటపడడం చాలా ఆనందంగా అనిపించింది’ అని సదరు మహిళ సంతోషం వ్యక్తం చేసింది.
మరో విశేషం ఏమిటంటే, బాలుడు పడిపోయిన అపార్ట్‌మెంటును ఆనుకుని విద్యుత్ తీగెలు కూడా ఉన్నాయి. కిందపడిన సమయంలో బాలుడు విద్యుత్ తీగెలపై పడివున్నా విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయేవాడు. ఈ విధంగా రెండు ప్రమాదాల నుంచి ఆ బాలుడు సురక్షితంగా బయటపడడంతో అదో అద్భుతంగా అపార్ట్‌మెంటువాసులు భావించారు. అతను మృత్యుంజయుడని మురిసిపోయారు.