Seva Mitra: ఆగిపోయిన టీడీపీ 'సేవామిత్ర' యాప్!
- ఈ ఉదయం నుంచి ఆగిపోయిన సేవామిత్ర
- ఇప్పటికే ఆగిపోయిన టీడీపీ అధికార వెబ్ సైట్
- తెలుగు రాష్ట్రాల మధ్య డేటా వార్ వివాదం
తెలుగుదేశం పార్టీ క్రియాశీల కార్యకర్తలు, ఆ పార్టీ అభిమానులు, పార్టీ నుంచి లబ్దిపొందిన వారి సమస్త సమాచారంతో ఉండే 'సేవామిత్ర' యాప్ కార్యకలాపాలు ఈ ఉదయం నుంచి ఆగిపోయాయి. ఈ యాప్ ను ఓపెన్ చేసిన వారికి, ఎటువంటి సమాచారమూ కనిపించడం లేదు. నిన్న తెలుగుదేశం అధికార వెబ్ సైట్ సేవలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. గడచిన వారం రోజులుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల మధ్య డేటా వార్, ఓట్ల తొలగింపు వివాదం కాకరేపుతున్న సంగతి తెలిసిందే.
ఓటర్ల సమస్త సమాచారం సేవామిత్ర యాప్ లో ఉందని, దాని ద్వారా తమ పార్టీకి సానుభూతిపరులుగా లేని వారి ఓట్లను టీడీపీ నేతలు తొలగిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేయగా, సుమారు 20 ఏళ్లుగా తాము దాచిపెట్టుకున్న డేటాను తెలంగాణ ప్రభుత్వ సర్కారు అండతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంగిలించిందని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై తెలంగాణ సిట్ ను ఏర్పాటు చేయగా, ఏపీ సర్కారు సైతం రివర్స్ సిట్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ మొత్తం వ్యవహారంలో ప్రస్తుతం పరారీలో ఉన్న డేటా గ్రిడ్ చీఫ్ అశోక్ ను అదుపులోకి తీసుకుంటే మొత్తం వ్యవహారం బయటకు వస్తుందని తెలంగాణ సిట్ అధికారులు అంటున్నారు.