India: పాక్ విమానం నుంచి తప్పించుకునేందుకు అభినందన్ చివరి ప్రయత్నంగా ఏంచేశాడో తెలుసా?
- ఒంటరిగా పీఓకేలో ప్రవేశించిన వింగ్ కమాండర్
- ఆర్73 క్షిపణితో శత్రువిమానం కూల్చివేత
- వెనుదిరిగే ప్రయత్నంలో మంటల్లో చిక్కుకున్న విమానం
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ సాహసం ఎవరూ ఊహించలేనిది. భారత గగనతలంలోకి చొచ్చుకువచ్చిన పాక్ విమానాలను వెంటాడుతూ ఐఏఎఫ్ యుద్ధ విమానాలు ఎల్వోసీ వరకు వెళ్లినా, అభినందన్ నడుపుతున్న మిగ్-21 బైసన్ మినహా మిగతావన్నీ సైనిక స్థావరాల రక్షణ కోసం తిరిగొచ్చేశాయి. అభినందన్ కు మాత్రం పాక్-16 విమానాన్ని వెంటాడేందుకు అనుమతినిచ్చారు భారత వాయుసేన అధికారులు. దాంతో రెట్టించిన ఉత్సాహంతో దూసుకెళ్లిన అభినందన్ పీఓకేలో ప్రవేశించిన కాసేపటికి శత్రువిమానాన్ని క్లోజ్ రేంజ్ లోకి తీసుకొచ్చాడు.
ఎంతో ఆధునికమైన ఎఫ్-16ను ఏమార్చి బుట్టలో వేయడానికి తన విమానంతో అనేక రకాల విన్యాసాలు చేశాడు అభినందన్. సరిగ్గా గురి కుదిరిందని నిశ్చయించుకుని ఆర్-73 మిస్సైల్ తో పాక్ ఎఫ్-16ను లాక్ చేశాడు. శత్రు విమానం ఎంత సమీపంలో ఉందో లెక్కగట్టిన అభినందన్ దాన్ని కూల్చడానికి ఆర్-73 క్షిపణి సరైన ఆయుధమని అంచనా వేశాడు. అతడి అంచనా తప్పలేదు. మిగ్-21 బైసన్ నుంచి దూసుకెళ్లిన క్షిపణి పాక్ విమానాన్ని తునాతునకలు చేసింది. ఇంతలో మరికొన్ని విమానాలు అభినందన్ విమానానికి సమీపంలోకి వచ్చాయి. అవే కాదు, సామ్ (సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్స్) క్షిపణులు కూడా తన మిగ్ ను టార్గెట్ చేసుకునే వీలుండడంతో అత్యంత ప్రమాదకరమైన 'హై-జి బ్యారెల్ రోల్' విన్యాసాలు చేశాడు.
ఓ యుద్ధ విమానాన్ని శత్రువిమానాలు అత్యంత సమీపంలోకి వచ్చి చుట్టుముట్టినప్పుడు చివరి ప్రయత్నంగా ఈ విన్యాసాలు చేస్తారు పైలట్లు. ఇందులో భాగంగా విమానాన్ని గాల్లోనే గిరికీలు కొట్టిస్తూ ఓ వైపు వాలిపోయినట్టుగా ముందుకు వెళతారు. ఓ స్క్రూను ఎలా తిప్పుతారో విమానం కూడా అలాగే గాల్లో గింగిరాలు తిరిగిపోతుంది. కానీ, అభినందన్ దురదృష్టం కొద్దీ అతడి విమానం దాడికి గురైంది. దాంతో అతడు పారాచూట్ సాయంతో దూకేయక తప్పలేదు.