India: అభినందన్ తెలివికి అడ్డంగా పడిపోయిన హోరాన్ గ్రామస్తులు!

  • అభినందన్ తెగువకు పాకిస్థానీల ఆశ్చర్యం
  • అతడి తెలివి అమోఘం అంటూ వెల్లడి
  • విచక్షణే అతడ్ని కాపాడిందంటూ ముక్తాయింపు

భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ పాకిస్థాన్ కస్టడీ నుంచి విడుదలై రోజులు గడుస్తున్నా అతడికి సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా, జాతీయ మీడియాలో దిగ్గజ సంస్థలైన ఇండియాటుడే, ఆజ్ తక్ ప్రతినిధులు అభినందన్ పట్టుబడిన హోరాన్ గ్రామానికి వెళ్లి వాస్తవ పరిస్థితులను తెలుసుకున్నారు. వారి పరిశీలనలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారత మీడియా ప్రతినిధులు అసలేం జరిగిందన్న విషయాన్ని హోరాన్ గ్రామవాసి మహ్మద్ కమ్రాన్ ను అడిగి తెలుసుకున్నారు.

"కనీసం ఆరు విమానాలు ఆకాశంలో హోరాహోరీగా తలపడడం కనిపించింది. వాటిలో ఒకటి భారత్ వైపు ఉన్న పర్వతాల అవతలి నుంచి వచ్చింది. దాన్ని వెంటాడుతూ ఓ విమానం వచ్చింది. బహుశా అది పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ కు చెందినదయ్యుంటుంది. ఆ విమానాలు కాసేపు వలయాకారంలో తిరగడం మొదలుపెట్టాయి. అంతలోనే వాటిలో ఒక విమానం మంటల్లో చిక్కుకుంది. అది కూలిపోతూ ఉండగా పారాచూట్ తగిలించుకుని పక్షిలా నేలకు దిగుతున్న పైలట్ కనిపించాడు. ఓ చిన్న కొండపై దిగాడు. అక్కడికి హోరాన్ గ్రామస్తులు వెళ్లగానే అతడు మంచినీళ్లు ఇవ్వమని అడిగాడు, అంతేకాదు మొబైల్ ఫోన్ ఇవాల్సిందిగా కోరాడు. అయితే తాను ఎక్కడ ఉన్నదీ తెలుసుకునేందుకు అతడు చూపించిన తెలివితేటలు ఇప్పటికీ మాకు గుర్తున్నాయి.

మొదట మమ్మల్ని భారత్ ప్రధానమంత్రి ఎవరో చెప్పమన్నాడు. మేం కరెక్ట్ గానే చెప్పేసరికి మరింత తెలివిగా "భారత్ మాతాకీ జై" అంటూ నినాదాలు చేసి రెచ్చగొట్టాడు. దాంతో మావాళ్లు అతడి ట్రాప్ లో పడిపోయారు. ఆవేశంగా అతడికి దగ్గరగా వెళ్లి ఇది పాకిస్థాన్, ఇక్కడ అలాంటి నినాదాలు చేయొద్దు అంటూ హెచ్చరించారు. దాంతో తాను దిగింది పాకిస్థాన్ లో అని గ్రహించి రివాల్వర్ చూపిస్తూ పరుగందుకున్నాడు. తన వద్ద ఉన్న కాగితాలు పరపరా చించేసి నమిలేశాడు. దాంతో మావాళ్లు రాళ్లు విసురుతూ అతడ్ని వెంటాడారు. ఆ కొండకు దిగువన ఉన్న ఓ చిన్నవాగులో దూకడంతో వెంటనే దొరికిపోయాడు.

అయితే అతడు రివాల్వర్ ను గ్రామస్తులపై ఉపయోగించి ఉంటే మాత్రం మావాళ్లు కొట్టి చంపేవాళ్లు. కానీ అతడి విచక్షణే అతడి ప్రాణాలు కాపాడింది. రివాల్వర్ ను గాల్లోకి కాల్చి బెదిరింపులతో సరిపెట్టడంతో మావాళ్లు కూడా అతడిని కొట్టడంతో సరిపెట్టారు. అంతలోకి సరిహద్దు ప్రాంతం నుంచి పాక్ ఆర్మీ రావడంతో అభినందన్ ను వాళ్లకు అప్పగించాం" అంటూ మహ్మద్ కమ్రాన్ అసలేం జరిగిందో మొత్తం వివరించాడు.

  • Loading...

More Telugu News