Hyderabad: బ్యాంకు లాకర్లు మరీ ఇంత ఘోరమా?: దస్తావేజులకు చెదలు.. లబోదిబోమంటున్న ఖాతాదారు!
- ఐదేళ్లుగా లాకర్‌లో నగలు, దస్తావేజులు భద్రం చేసిన ఉపాధ్యాయుడు
- చెదలు పట్టి పాడైపోయిన దస్తావేజులు
- తమకు సంబంధం లేదన్న బ్యాంకు మేనేజర్
లాకర్‌లో పెడితే భద్రతకు ఢోకా ఉండదని భావించిన ఓ వ్యక్తి విలువైన పత్రాలు, బంగారు ఆభరణాలను అందులో పెట్టాడు. ఇటీవల బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండడంతో నగల కోసం లాకర్ ఓపెన్ చేసిన అతడికి మైండ్ బ్లాంక్ అయినంత పనైంది. లోపల విలువైన దస్తావేజులు కాస్తా చెదలు పట్టి పూర్తిగా ధ్వంసమయ్యాయి.
హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ బహదూర్‌గూడకు చెందిన ఉపాధ్యాయుడు గంధం వెంకటయ్య.. తన భార్య కరుణశ్రీ బంగారు నగలతోపాటు మూడు ప్లాట్లకు సంబంధించిన దస్తావేజులను మన్సూరాబాద్ డివిజన్ సహారా రోడ్డులోని ఆంధ్రాబ్యాంక్ లాకర్‌లో ఐదేళ్ల క్రితం భద్రపరిచారు.
బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండడంతో నగల కోసం బ్యాంకుకు వెళ్లిన వెంకటయ్య లాకర్ తెరిచి నిర్ఘాంతపోయారు. అందులోని దస్తావేజులను చెదలు పూర్తిగా ధ్వంసం చేశాయి. దీంతో లబోదిబోమన్న వెంకటయ్య అధికారులకు ఫిర్యాదు చేశాడు. గత డిసెంబరులో చూసినప్పుడు బాగానే ఉన్నాయని, ఇప్పుడు పూర్తిగా పనికిరాకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ విషయమై బ్యాంకు మేనేజర్ సోమశేఖర్ మాట్లాడుతూ.. దస్తావేజులను చెదలు తినేసిన విషయం తమకు తెలియదన్నారు. అందులో పెట్టిన వస్తువులకు తాము బాధ్యత వహించబోమని, లాకర్ సదుపాయం మాత్రమే తాము కల్పిస్తామని చెప్పుకొచ్చారు. లాకర్‌లోకి నీరు చేరడం వల్లే ఇలా జరిగి ఉంటుందని లాకర్‌ను సరఫరా చేసిన గోద్రెజ్ కంపెనీ తెలుగు రాష్ట్రాల మేనేజర్ నరసింహారావు పేర్కొన్నారు.