Chandrababu: ఏం లేకపోతే ఈ విషాద వీచికలేమిటి చంద్రబాబూ?: విజయసాయిరెడ్డి
- కుల మీడియాల ద్వారా అవాస్తవాల ప్రచారం
- దొరికిపోయిన దొంగలా చంద్రబాబు నాయుడు
- ఎన్నికల క్షేత్రంలోనే తేల్చుకుందామని సవాల్
ఏపీ సీఎం చంద్రబాబునాయుడికి, ఆయన కుమారుడు లోకేశ్ కు కుల మీడియాల ద్వారా అవాస్తవాలను ప్రచారం చేయించుకోవడం, దొంగతనం చేసి దొరికిపోయిన తరువాత కూడా దొంగా దొంగా అని అరవడం అలవాటై పోయాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. నాలుగు సంవత్సరాల క్రితం ఓటుకు నోటు కేసులో దొరికినప్పటి దృశ్యాన్నే ఇప్పుడు చంద్రబాబు రిపీట్ చేయిస్తున్నారని, ఏం లేకపోతే ఈ విషాద వీచికలేమిటి చంద్రబాబూ? అని ఆయన ప్రశ్నించారు.
ఇంగ్లీష్ రాకపోయినా, బ్రిటీష్ పాలకుల విభజించు- పాలించు సూత్రాన్ని వంటబట్టించుకున్న ఆయన, ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు ఓసీలను కూడా విభజించారని నిప్పులు చెరిగారు. ఎన్ని తప్పులు చేసినా కప్పిపుచ్చుకోవడం తాత్కాలికమేనని, తప్పు చేసిన వాళ్లు తప్పించుకోలేరని అన్నారు. నేడో, రేపో ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతుందని, ఆపై ఎన్నికల క్షేత్రంలోనే తేల్చుకుందామని సవాల్ విసిరారు.
నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలి వానకి ఎలా కొట్టుకుపోతుందో చంద్రబాబు నక్కజిత్తుల కుట్రలకు అలాగే తెరపడుతుందని విజయసాయి హెచ్చరించారు. ప్రజలు తమ సమాచారం తస్కరణకు గురి కాకుండా చూసుకునేందుకు వెంటనే ఏటీఎం, క్రెడిట్ కార్డుల పాస్ వర్డ్ లను మార్చుకోవాలని, ఫోన్ నంబర్ మార్చుకుని, దాన్ని అనుసంధానం చేసుకోవాలని సలహా ఇచ్చారు.