hyderabad old city: నిఖా పేరుతో యువతికి వల... బహుమతి పేరుతో రూ.16 లక్షలకు నైజీరియన్ టోకరా!

  • లండన్‌లో ఉద్యోగం అంటూ నైజీరియన్‌ మాయమాటలు
  • పెళ్లి చేసుకుని హైదరాబాద్‌లో స్థిరపడతానని వెల్లడి
  • నిజమని నమ్మి మోసపోయిన పాతబస్తీ యువతి

ఆన్‌లైన్‌ మోసాల్లో అందెవేసిన చేతులుగా పేరొందిన నైజీరియన్లు ఇటీవల ఖాతాదారుల్లో చైతన్యం పెరిగిందని గ్రహించినట్టున్నారు. తమ మోసాలకు సరికొత్త పంథా ఎంచుకున్నారు. ఓ నైజీరియన్‌ నిఖా పేరుతో ఓ ముస్లిం యువతికి వలవిసిరి ఏకంగా రూ.16 లక్షలు దోచుకున్నాడు. బాధితురాలు పోలీసులకు అందించిన ఫిర్యాదు మేరకు వివరాలివి. పాతబస్తీకి చెందిన ఓ యువతి రెండు నెల క్రితం జీవన్‌సాథీ డాట్‌కామ్‌లో తన పేరు, వివరాలు నమోదు చేసుకుంది.

 ఢిల్లీలో ఉంటున్న ఓ నైజీరియన్‌ ఆమె వివరాలు చూసి సంప్రదించాడు. ఇస్లాంఖాన్‌గా తనను తాను పరిచయం చేసుకున్నాడు. లండన్‌లో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాని చెప్పాడు. తన తల్లిదండ్రులు భారతీయ ముస్లింలని, ఏళ్లనాడు లండన్‌ వెళ్లి అక్కడ స్థిరపడిపోయారని చెప్పాడు. అంతేకాకుండా లండన్‌లో  తాను బాగా సంపాదించానని, ఇటీవలే తన తల్లి భారత్‌లో మన మూలాలున్నాయని చెప్పడంతో ఈ దేశంపై ఆసక్తి కలిగిందని చెప్పుకొచ్చాడు. ఇస్లాం సంప్రదాయాలు, సంస్కృతి తెలిసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నది తన లక్ష్యమని, పెళ్లయ్యాక హైదరాబాద్‌లోనే స్థిరపడదామని మాయమాటలతో ఆ యువతిని నమ్మించాడు.

అతని మాటలు విశ్వసించిన సదరు యువతి అప్పుడప్పుడూ వాట్సాప్‌లో అతనితో మాట్లాడుతుండేది. ఈ నేపథ్యంలో గత నెల 12వ తేదీన నైజీరియన్ ఫోన్‌చేసి పెళ్లి ఖర్చుల కోసం 75 వేల పౌండ్లు (భారతీయ కరెన్సీలో రూ.54 లక్షలు) పంపుతున్నానని, బహుమతి పెట్టె శంషాబాద్‌ చేరగానే అధికారులు ఫోన్‌ చేస్తారని చెప్పాడు. మూడు రోజుల తర్వాత నైజీరియనే విమానాశ్రయం అధికారిగా ఫోన్‌ చేసి మీ పేరున లండన్‌ నుంచి బహుమతి వచ్చిందని, మా నిబంధనల మేరకు రూ.10వేల పౌండ్లకు మించి చెల్లించకూడదని, మిగిలిన దాన్ని  ఇవ్వాలంటే రూ.1.5 లక్షలు చెల్లించాలన్నాడు.

విమానాశ్రయ అధికారే మాట్లాడుతున్నాడని నమ్మిన ఆ యువతి అతను చెప్పిన ఖాతాలో ఆ డబ్బు వేసింది. ఆ తర్వాత ఆదాయ పన్ను చెల్లించాలని చెప్పడంతో  మరో 1.7 లక్షలు అకౌంట్‌లో వేసింది. ఈసారి గిఫ్ట్‌ ట్యాక్స్‌గా రూ.8.3 లక్షలు చెల్లించాలని వలవిసిరాడు. అంత డబ్బు సదరు యువతి వద్ద లేకపోవడంతో  తండ్రికి విషయం చెప్పింది. ఆమె పెళ్లి కోసం ఇల్లు అమ్మి బ్యాంకులో ఉంచిన రూ.70 లక్షల నుంచి రూ.10 లక్షలు తీసి ఇచ్చాడు.

చివరిగా మరో రూ.4.5 లక్షలు చెల్లిస్తేనే బహుమతి పంపిస్తామని అధికారులు చెప్పడంతో ఆ డబ్బు కూడా జమ చేసింది. ఇలా వారం రోజుల వ్యవధిలో మొత్తం రూ.16 లక్షలు తన ఖాతాలో జమ చేయించుకున్నాడు. అనంతరం ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసేశాడు. వరుసగా రెండు రోజులు ఫోన్‌ చేసినా అతని నుంచి స్పందన లేకపోవడంతో తాను మోసపోయానని గుర్తించిన ఆ యువతి సైబరాబాద్‌ పోలీసులను ఆశ్రయించింది.

  • Loading...

More Telugu News