Lokeshwar Reddy: 'డేటా చోరీ'పై ఫిర్యాదు చేసిన లోకేశ్వర్ రెడ్డి... ఎవరో తెలుసా?
- కలకలం రేపుతున్న డేటా చోరీ కేసు
- జగన్ కు అత్యంత సన్నిహితుల్లో లోకేశ్వర్ ఒకరు!
- పార్టీకి ఐటీ సంబంధిత సేవలందిస్తున్న లోకేశ్వర్
తెలంగాణ, ఏపీల మధ్య ఇప్పుడు 'డేటా చోరీ' కేసు తీవ్ర కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో తొలుత పోలీసులను ఆశ్రయించిన వ్యక్తి తుమ్మల లోకేశ్వర్ రెడ్డి. ఈయన అక్రమాలను బయటపెట్టిన వ్యక్తని కేటీఆర్ సైతం ప్రశంసించారు. ఆయన టెక్నికల్ ఎక్స్ పర్ట్ అని వైసీపీ చెబుతోంది.
ఇక లోకేశ్వర్ రెడ్డి నేపథ్యాన్ని పరిశీలిస్తే... వైఎస్ రాజశేఖరరెడ్డి, తన కుమార్తె షర్మిలను సొంత బావమరిది, విజయమ్మ సోదరుడు చంద్రప్రతాప్ రెడ్డికి ఇచ్చి వివాహం చేయగా, కొన్ని కారణాలతో వారి బంధం ఎక్కువ రోజులు నడవలేదు. ఆపై చంద్రప్రతాప్, ఇరగంరెడ్డి తిరుపతిరెడ్డి కుమార్తె పద్మావతిని వివాహం చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత చంద్రప్రతాప్ రోడ్డు ప్రమాదంలో మరణించారు.
అయితే, తన సోదరుడి భార్య ఒంటరిగా ఉండటాన్ని చూడలేకపోయిన విజయమ్మ, ఆమెకో దారి చూపాలని భావించి, చెన్నూరు మండలం ఉప్పరపల్లెకు చెందిన లోకేశ్వర్ రెడ్డితో పద్మావతికి పెళ్లి జరిపించారు. దీంతో లోకేశ్వర్ రెడ్డి తొలుత వైఎస్ ఇంటి మనిషిగా, ఆపై జగన్ కు సన్నిహితుడిగా మారారని తెలుస్తోంది. సాంకేతిక రంగంలో తనకున్న పట్టుతో డేటా అనాలసిస్ట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్నారని సమాచారం.