Tollywood: చిరంజీవి గురించి అలా రాయొద్దు: మీడియాపై జీవిత రుసరుసలు
- అసలు విషయాన్ని వక్రీకరిస్తున్నారు
- మీడియాలో రకరకాలుగా రాస్తున్నారు
- జీవిత అసహనం
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల వేడి క్రమంగా పెరుగుతోంది. ఓవైపు ప్రస్తుత అధ్యక్షుడు శివాజీ రాజా ప్యానెల్, మరోవైపు సీనియర్ నటుడు నరేష్ ప్యానెల్ విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అయితే, నరేష్ ప్యానెల్ సభ్యులు మెగాస్టార్ చిరంజీవిని కలిసిన నేపథ్యంలో అనూహ్య వివాదం తెరపైకి వచ్చింది. నరేష్ ప్యానల్ కు చిరంజీవి మద్దతు లేదని, చిరు మాటను లెక్కచేయకుండా నరేష్ ఎన్నికల్లో నిలబడ్డాడని కథనాలు వచ్చాయి.
వీటిపై నటి జీవిత తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నరేష్ ప్యానెల్ లో జీవిత 'మా' ప్రధాన కార్యదర్శిగా పోటీచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ, 'మా' ఎలక్షన్స్ గురించి మీడియాలో వస్తున్న వార్తలు చాలా బాధ కలిగిస్తున్నాయని అన్నారు. తప్పుడు వాతావరణం సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన జీవిత, ఈ విషయంలో చిరంజీవి పేరు రావడం మరింత ఇబ్బంది కలిగిస్తోందని అన్నారు.
నరేష్ ప్యానెల్ కు చిరంజీవి సపోర్ట్ లేదని, తన మాటను ధిక్కరించారన్న కారణంగా నరేష్ కు మెగాస్టార్ మద్దతు ఇవ్వడం లేదంటూ మీడియాలో ఇష్టంవచ్చినట్టు రాస్తున్నారని మండిపడ్డారు. వాస్తవానికి చిరంజీవి ఎవరికీ సపోర్ట్ చేయడంలేదని, ఎవరు గెలిచినా అందరం కలిసి పనిచేద్దామని మాత్రమే ఆయన అన్నారని జీవిత స్పష్టం చేశారు.
'మనమందరం ఒకే కుటుంబం, ఆరోగ్యకరమైన వాతావరణంలో పోటీపడండి' అని అందరికీ చెప్పారని ఆమె వివరించారు. మా ఎన్నికలను లక్షలమంది గమనిస్తున్న వేళ ఇలాంటి ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలని మీడియాను కోరారు. ఏకగ్రీవం కుదరని కారణంగానే తాము ఎన్నికల్లో పోటీ చేయాల్సివస్తోంది తప్ప తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని జీవిత స్పష్టం చేశారు.