India: బాలాకోట్ లో కచ్చితంగా ఎంతమంది చనిపోయారన్న సంగతి పాకిస్థాన్ నేతలకు మాత్రమే తెలుసు!: రాజ్ నాథ్ సింగ్
- మృతుల సంఖ్య నేడో, రేపో చెబుతాం
- ఎంతమంది చనిపోయారో పాకిస్థాన్ కు మాత్రమే తెలుసు
- బీఎస్ఎఫ్ కార్యక్రమంలో హోంమంత్రి వ్యాఖ్యలు
ఓవైపు కేంద్రం సర్జికల్ స్ట్రయిక్స్-2 తదనంతర పరిణామాలపై దృష్టి సారించగా, విపక్షాలు మాత్రం ఏ రకంగా ఇరుకున పడేద్దామా అంటూ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎన్డీయేకి పొలిటికల్ మైలేజీ దక్కకూడదన్న కసి విపక్షాల తీరులో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అటు అధికార పక్షం కూడా బ్యాటిల్ గెలిచాం ఇక బ్యాలెట్ మిగిలుందంటూ ఎన్నికల వేళ కొత్త ఉత్సాహం ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో, ప్రతిపక్షాల విమర్శలకు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ దీటుగా బదులిచ్చారు.
సర్జికల్ దాడుల్లో ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారో చెప్పండంటూ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారని, ఆ విషయం ఇవ్వాళో రేపో తేలుతుందని అన్నారు. కానీ బాలాకోట్ ఉగ్రస్థావరంలో కచ్చితంగా ఎంతమంది చనిపోయారన్న సంగతి పాకిస్థాన్ నేతలకు మాత్రమే తెలుసని వ్యాఖ్యానించారు. భారత వాయుసేన దాడులు నిర్వహించడానికి ముందు బాలాకోట్ స్థావరం వద్ద దాదాపు 300 మొబైల్ ఫోన్ల సిగ్నళ్లను నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్టీఆర్ఓ) గుర్తించిందని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు.
"ఎంతమందిని చంపారు? ఎంతమందిని చంపారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దాడుల తర్వాత ఎయిర్ ఫోర్స్ సిబ్బంది వెళ్లి 1, 2, 3, 4, 5.. అని ఎంతమంది చచ్చిపోయారో లెక్కబెట్టాలా?. ఎన్టీఆర్ఓ అందించిన సమాచారం కచ్చితమైనదిగా భావిస్తున్నాం. దాడికి ముందు బాలాకోట్ స్థావరం వద్ద 300 మొబైల్ ఫోన్లు యాక్టివ్ గా ఉన్నట్టు తెలిసింది. మొబైల్ ఫోన్లు మనుషులు కాక అక్కడున్న చెట్టుచేమలు ఉపయోగిస్తాయా? నిన్నటిదాకా మన సాయుధ దళాల సత్తాను శంకించారు... ఇప్పుడు ఎన్టీఆర్ఓ సామర్ధ్యాన్ని కూడా సందేహిస్తారా?" అంటూ విపక్షాలపై విరుచుకుపడ్డారు రాజ్ నాథ్ సింగ్. అసోంలోని ధుబ్రి వద్ద బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) కు చెందిన ఓ ప్రాజక్ట్ ప్రారంభోత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.