India: పాక్ డ్రోన్ ను కూల్చేసిన భారత యుద్ధ విమానం
- సుఖోయ్ దాడిలో తునాతునకలైన మానవరహిత విమానం
- బికనేర్ నల్ సెక్టార్లో ఘటన
- కొన్నిరోజుల వ్యవధిలో ఇది రెండోది
పాకిస్థాన్ ఎప్పట్లాగానే తన కవ్వింపులు కొనసాగిస్తోంది. సోమవారం రాజస్థాన్ లోని బికనేర్ నల్ వద్ద భారత గగనతలంలోకి ఓ డ్రోన్ ను పంపించింది. అయితే ఈ డ్రోన్ ను భారత్ కు చెందిన సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానం కూల్చివేసింది. భారత గగనతలంలోకి అక్రమంగా ప్రవేశించడంతో ఆ డ్రోన్ కూల్చివేశామని భద్రతా బలగాలు చెబుతున్నాయి.
బోర్డర్ లో డ్రోన్ ప్రవేశించినట్టు రాడార్లపై స్పష్టంగా కనిపించడంతో అందుబాటులో ఉన్న సుఖోయ్ యుద్ధ విమానం ద్వారా దాన్ని కూల్చివేసినట్టు అధికారులు తెలిపారు. కొన్నిరోజుల క్రితమే గుజరాత్ లోని కచ్ వద్ద సరిహద్దుకు సమీపంలో పాకిస్థాన్ కు చెందిన డ్రోన్ ను భారత బలగాలు నేలకూల్చడం తెలిసిందే. బాలాకోట్ లోని జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరంపై భారత వాయుసేన దాడులు జరిపిన కొద్ది వ్యవధిలోనే ఆ డ్రోన్ భారత గగనతలంలో ప్రత్యక్షమైంది.