India: కాస్త బుర్ర ఉపయోగించండయ్యా..!: విపక్షాలకు మోదీ హితవు
- నేను చెప్పిందేంటి? మీరు మాట్లాడేదేంటి?
- కామన్ సెన్స్ ఉండాలి
- ప్రధాని అసహనం
రాఫెల్ ఫైటర్ విమానాలు ఉండుంటే పరిస్థితి మరోలా ఉండేదని తాను చేసిన వ్యాఖ్యలను విపక్షాలు వక్రీకరించాయంటున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రతిపక్ష నేతలు కొంచెం కూడా బుర్ర లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. సోమవారం గుజరాత్ లోని జామ్ నగర్ లో ఆయన మాట్లాడుతూ... ఫిబ్రవరి 27న భారత్, పాక్ మధ్య జరిగిన గగనతల పోరాటంలో రాఫెల్ యుద్ధ విమానాలు ఉండుంటే భారత వాయుసేనకు గొప్ప ఆధిక్యం దక్కేదని తాను వ్యాఖ్యానిస్తే... మన వాయుసేన సత్తాని ప్రధాని శంకిస్తున్నారంటూ విపక్షాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.
"దయచేసి కాస్త బుర్రను ఉపయోగించండి. భారత్, పాక్ యుద్ధ విమానాలు పరస్పరం దాడులకు దిగినప్పుడు రాఫెల్ వంటి అత్యాధునిక జెట్ విమానం మన పక్షాన ఉంటే మన యుద్ధ విమానం ఒక్కటి కూడా కూలిపోయి ఉండేది కాదని అన్నాను. అదే సమయంలో ప్రత్యర్థుల విమానాల్లో ఒక్కటి కూడా తప్పించుకుని ఉండేది కాదు అని చెప్పాను" అంటూ వివరణ ఇచ్చారు. కొందరు ఇప్పటికీ మన సాయుధ దళాల సామర్థ్యాన్ని సందేహిస్తుండడం అర్థంకాని విషయం అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.