India: 'మసూద్ అజహర్ మృతి'పై ఆరా తీస్తున్న భారత నిఘా వర్గాలు
- చనిపోయాడంటూ వార్తలు
- నిజంలేదన్న జైషే మహ్మద్
- పెదవి విప్పని పాక్
ప్రమాదకర ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజహర్ మరణించాడంటూ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అవుతున్న నేపథ్యంలో అసలు విషయం తెలుసుకునేందుకు భారత నిఘా వర్గాలు రంగంలోకి దిగాయి. జైషే అధినేత మూత్రపిండాల వైఫల్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరాడన్న సమాచారం తప్ప తమ వద్ద మరే సమాచారం లేదని భారత ఇంటెలిజెన్స్ అధికారులు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మసూద్ అజహర్ మరణించాడన్న వార్తలు కనిపిస్తున్న నేపథ్యంలో ఆ విషయమై ఇప్పుడే ఎలాంటి నిర్ధారణకు రాలేమని తెలిపారు. దీనిపై దృష్టి సారించామని, పూర్తి వివరాలు తెలుసుకుంటామని అన్నారు.
మసూద్ అజహర్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడని, మూత్రపిండాలు పాడయిపోవడంతో కనీసం ఇంటి నుంచి బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నాడని పాక్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషి కొన్నిరోజుల క్రితం ఓ ప్రకటనలో తెలిపారు. అసలు, సర్జికల్ దాడులు జరిగినప్పటి నుంచి ఈ ఉగ్రనేత నుంచి ఒక్క ప్రకటన కూడా రాకపోవడంతో బతికున్నాడా? లేదా? అనే విషయమై భారత వర్గాలు సైతం సందిగ్ధతలో ఉన్నాయి. ప్రస్తుత వదంతులపై పాక్ నుంచి కనీస స్పందన రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.