modi: రాఫెల్ యుద్ధ విమానాలు ఇప్పుడు ఉండుంటే... పరిస్థితి మరోలా ఉండేది: మోదీ
- రాఫెల్ విమానాలు మన వద్ద లేవని ప్రజలంతా మధనపడుతున్నారు
- కొందరి స్వార్థ రాజకీయాలతో దేశం నష్టపోయింది
- మోదీని వ్యతిరేకించండి.. జాతి ప్రయోజనాలను కాదు
పాకిస్థాన్ పై పోరాటంపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి సున్నితమైన సమయంలో రాఫెల్ యుద్ధ విమానాలు మన దగ్గర ఉంటే... పరిస్థితి మరోలా ఉండేదని ఆయన అన్నారు. 'ఈ సమయంలో రాఫెల్ విమానాలు మన దగ్గర లేవే' అని దేశ ప్రజలంతా మధనపడుతున్నారని చెప్పారు. రాఫెల్ జెట్స్ ఇప్పుడు మన వద్ద ఉంటే పరిస్థితి ఎలా ఉండేదని ప్రశ్నించారు. ఇండియా టుడే సదస్సులో ప్రసంగిస్తూ ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. కొంత మంది స్వార్థ రాజకీయాలతో దేశం చాలా నష్టపోయిందని అన్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై మోదీ పరోక్ష విమర్శలు గుప్పించారు. దేశమంతా సాయుధబలగాల వెంట నిలిస్తే... కొందరు వ్యక్తులు మాత్రం ఆ బలగాలపై సందేహాలను వ్యక్తం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ పార్టీలు చేస్తున్న వ్యాఖ్యలు పాకిస్థాన్ కు అనుకూలంగా ఉంటున్నాయని అన్నారు. భారత్ కు వ్యతిరేకంగా విషం చిమ్మడానికి వీరి వ్యాఖ్యలను పాకిస్థాన్ వాడుకుంటోందని విమర్శించారు. స్వార్థ రాజకీయాల కోసం వీరంతా దేశ ప్రయోజనాలనే పణంగా పెడుతున్నారని దుయ్యబట్టారు.
అవసరమైతే మీరు తనను వ్యతిరేకించాలని, జాతి ప్రయోజనాలను మాత్రం వ్యతిరేకించవద్దని మోదీ అన్నారు. హఫీజ్ సయీద్, మసూద్ అజార్ లాంటి వాళ్లకు సాయపడకుండా జాగ్రత్త పడాలని సూచించారు. మోదీ వ్యతిరేకత ఇప్పుడు దేశ వ్యతిరేకతగా రూపుదాల్చిందని అన్నారు. ప్రస్తుతం భారత్ ను చూసి శత్రువులు భయపడుతున్నారని... ఈ భయం మంచిదేనని చెప్పారు. 2004-14 మధ్యలో జవాన్లకు కనీసం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కూడా లేవని... గత నాలుగేళ్లలో 2.3 లక్షల బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను తాము భద్రతాదళాలకు ఇచ్చామని తెలిపారు.