Nara Lokesh: మోదీ సమేత కలువ కుంట జగన్ గారికి సిగ్గుగా అనిపించడం లేదా?: లోకేష్ ఫైర్
- మోదీ, జగన్, కేసీఆర్ పై విమర్శలు
- టీడీపీ సభ్యత్వాల సమాచారం దొంగిలించే ప్రయత్నం
- నేరుగా ఎదుర్కోలేక కుట్రలు
టీడీపీ యాప్ సేవామిత్రకు ఐటీ సేవలు అందిస్తున్న సంస్థలపై తెలంగాణ పోలీసులతో దాడి చేయించారంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబును నేరుగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక ముగ్గురు మోదీలు కుమ్మక్కై టీడీపీకి ఐటీ సేవలు అందించే సంస్థలపై దాడులు చేయిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ఘాటుగా స్పందించారు. కుట్రలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకోవడంలో విఫలం అయ్యారని, కుయుక్తులు ప్రయోగించినా అమరావతి నిర్మాణాన్ని ఆపలేకపోయారని ఎద్దేవా చేశారు నారా లోకేష్.
ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు, పార్టీ యాప్ సేవామిత్రలోని సమాచారం కూడా తస్కరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీకి ఐటీ సేవలు అందించే సంస్థల ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఉద్యోగులను అపహరించి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి పనులు చేయడానికి మోదీ సమేత కలువ కుంట జగన్ గారికి సిగ్గుగా అనిపించడంలేదా అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. క్యాడర్ లేని జగన్ గారిని షార్ట్ కట్ లో సీఎం చెయ్యాలని మోదీ, కేసీఆర్ కలలు కంటున్నారని ట్వీట్ లో పేర్కొన్నారు. నియంత మోదీగారు డైరక్షన్ చేస్తే, ఫ్యాక్షనిస్ట్ జగన్ గారు యాక్షన్ చేస్తున్నారని, దొర కేసీఆర్ గారిది ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని కామెంట్ చేశారు. వీళ్ల చర్యలకు ఆంధ్రా ప్రజలే రియాక్షన్ ఇస్తారని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు.