India: వాఘా బోర్డర్ వద్ద అభినందన్ పక్కన కనిపించిన మహిళ ఎవరో తెలుసా!
- వింగ్ కమాండర్ తో ఫొటోలకు పోజులు
- చెరగని చిరునవ్వుతో ఆకర్షించిన వైనం
- ఆమె ఎవరో తెలియక మీడియా సైతం తికమక
పాకిస్థాన్ సైన్యం కస్టడీ నుంచి విడుదలైన భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ శుక్రవారం రాత్రి వాఘా బోర్డర్ వద్ద భారత గడ్డపై కాలుమోపాడు. అభినందన్ ను భారత్ కు అప్పగించే క్రమంలో అతడిని లాహోర్ నుంచి రోడ్డు మార్గంలో వాఘా తీసుకొచ్చారు. అయితే అతడితో పాటు వాఘా చెక్ పోస్ట్ వద్ద కనిపించిన మహిళ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సల్వార్ కమీజ్ డ్రెస్సులో ఉన్న ఆమెను చూసి చాలామంది అభినందన్ తో పాటు వచ్చిన భారత అధికారి భార్యగా పొరబడ్డారు. మరికొందరు అభినందన్ భార్యే అనుకున్నారు. అయితే అసలు విషయం అది కాదు. ఆమె పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయంలో డైరక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఆమె పేరు డాక్టర్ ఫరీహా బుగ్టి.
ఆమె లాహోర్ నుంచి అభినందన్ తో పాటు ఒకే కాన్వాయ్ లో వాఘా వద్దకు చేరుకుని అప్పగింతల కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ముఖంపై చెరగని చిరునవ్వుతో ప్రక్రియ సాఫీగా జరిగేలా చూశారు. డాక్టర్ ఫరీహా ఈ విషయంలోనే కాదు పాక్ చెరలో ఉన్న మరో భారతీయుడు కుల్ భూషణ్ జాదవ్ విచారణలోనూ కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో కుల్ భూషణ్ ను అతడి కుటుంబ సభ్యులు ఇస్లామాబాద్ లో కలిసినప్పుడు డాక్టర్ ఫరీహా కూడా అక్కడే ఉన్నారు. పురుషాధిక్య ధోరణులు ఎక్కువగా ఉండే పాకిస్థాన్ లో డాక్టర్ ఫరీహా విదేశీ వ్యవహారాల నిపుణురాలిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.