India: ఉగ్రనేత మసూద్ అజర్ కు ఆర్మీ ఆసుపత్రిలో డయాలసిస్!
- ఉగ్రనేతకు మూత్రపిండాల వైఫల్యం
- ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స
- పాక్ వైఖరిపై సందేహాలు!
ఇటీవల పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఆత్మాహుతి దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడికి పాల్పడింది తామేనని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. అయితే, జైషే దాడి చేసిందనడానికి తమ వద్ద స్పష్టమైన ఆధారాలు లేవని ఆ సంస్థపై చర్యలు తీసుకునేందుకు పాక్ ససేమిరా అంటోంది.
ఇప్పుడు ఆ సంస్థ అధినేత మసూద్ అజర్ అనారోగ్యంతో బాధపడుతున్నాడని పాక్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషి ప్రకటించిన నేపథ్యంలో సీనియర్ భద్రతాధికారి ఒకరు ఆసక్తిర విషయాలు వెల్లడించారు. జైషే మహ్మద్ అధినేత మసూద్ అజర్ కు మూత్రపిండాల వైఫల్యం కారణంగా అతడికి క్రమం తప్పకుండా డయాలసిస్ చేయాల్సి వస్తోందని వివరించారు. ప్రస్తుతం మసూద్ అజర్ రావల్పిండిలోని ఓ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని వెల్లడించారు.
మసూద్ అజర్ ను శిక్షించాల్సిందేనంటూ భారత్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో... జైషే నేత తమ దేశంలోనే ఉన్నాడని అంగీకరించిన పాక్ అతడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడంటూ జాలిచూపిస్తోంది. అయితే అతడిని అరెస్ట్ చేయకుండా తప్పించేందుకు ఈ అనారోగ్యం ఎత్తుగడ అనే వాదనలు కూడా భారత వర్గాల్లో వినిపిస్తున్నాయి.