India: పాకిస్థాన్ ను అడ్డంగా బుక్ చేసిన భారత్.. ‘ఎఫ్-16’ యుద్ధవిమానాల దుర్వినియోగంపై వివరణ ఇవ్వాలన్న అమెరికా!
- పక్కా సాక్ష్యాలను సమర్పించిన ఇండియా
- అభినందన్ కూల్చిన ఎఫ్-16 శకలాల సమర్పణ
- ఇప్పుడేం చేయాలో తెలియక తల పట్టుకున్న పాకిస్థాన్
పాకిస్థాన్ లోని బాలాకోట్ లో ఉన్న జైషే ఉగ్రవాద స్థావరంపై భారత వాయుసేన(ఐఏఎఫ్) ఇటీవల దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందుకు ప్రతిగా పాక్ యుద్ధవిమానాలు భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చాయి. భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేయడానికి ఉరికాయి. దీనికి అత్యాధునిక ఎఫ్-16 యుద్ద విమానాలను దాయాది దేశం వినియోగించింది. ఇప్పుడు ఇదే పాకిస్థాన్ కు పెద్ద తలనొప్పిగా మారింది. భారత్ పై దాడికి ఎఫ్-16 యుద్ధ విమానాలను ఎందుకు వాడారో చెప్పాలని అగ్రరాజ్యం అమెరికా తాజాగా పాకిస్థాన్ ను డిమాండ్ చేసింది. ఈ విషయంలో వివరణ ఇవ్వాలని కోరింది.
అమెరికాకు చెందిన జనరల్ డైనమిక్స్, లాక్ హీడ్ మార్టిన్ సంస్థలు ఎఫ్-16 యుద్ధ విమానాన్ని తయారుచేస్తున్నాయి. అయితే ఉగ్రవాదుల ఏరివేతతో పాటు ఆత్మరక్షణకు మాత్రమే ఎఫ్-16లను వాడుతామని హామీ ఇచ్చిన పాకిస్థాన్ వీటిని అమెరికా నుంచి కొనుగోలు చేసింది. తాజాగా కశ్మీర్ లో ఇండియన్ ఆర్మీ స్థావరాలపై దాడికి ఎఫ్-16 యుద్ధ విమానాలను పాక్ వాడింది.
ఈ సందర్భంగా భారత పైలట్ అభినందన్ వర్ధమాన్ ఓ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చివేశాడు. దీంతో ఎఫ్-16తో పాటు అందులో వాడుతున్న అమ్రామ్ క్షిపణి శకలాలను భారత్ అమెరికాకు అందించి పాకిస్థాన్ ను ఇరుకున పెట్టింది. దీనిపై తొలుత బుకాయించిన పాక్ నేతలు.. భారత్ పూర్తి స్థాయి ఆధారాలు అందించడంతో అడ్డంగా దొరికిపోయి ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.