India: అభినందన్ అప్పగింతలో పాకిస్థాన్ ఎందుకు ఆలస్యం చేసిందో తెలుసా...!

  • బీటింగ్ ద రిట్రీట్ క్యాన్సిల్ చేసిన భారత్
  • పాక్ ప్లాన్ తల్లకిందులైన వైనం
  • అందుకే డాక్యుమెంటేషన్ సాగదీత

భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ను భారత్ కు అప్పగించడంలో శుక్రవారం హైడ్రామా చోటుచేసుకుంది. వాస్తవానికి అభినందన్ ను భారత్ కు అప్పగించడం అనేది పాక్ ఎంతో గొప్పగా భావించింది. తమ సహృదయతకు ఇంతకంటే నిదర్శనం మరొకటి లేదు అని చాటడానికి శతధా ప్రయత్నించింది. అందుకే అభినందన్ ను వాఘా బోర్డర్ వద్దకు తీసుకువచ్చి అక్కడ నిర్వహించే బీటింగ్ ద రిట్రీట్ కార్యక్రమంలో సగర్వంగా అప్పగించాలని తలపోసింది. కానీ భారత్ తన దాయాది ఉద్దేశాన్ని ముందే పసిగట్టిన నేపథ్యంలో వాఘా వద్ద నిర్వహించే బీటింగ్ ద రిట్రీట్ ను రద్దు చేసింది. దాంతో పాక్ ప్రణాళిక భగ్నమైంది.

బీటింగ్ ద రిట్రీట్ కార్యక్రమంలో అభినందన్ ను అప్పగించి అంతర్జాతీయ సమాజం దృష్టిలో పడాలని ఆశించిన పాక్ కు భారత్ నిర్ణయం మింగుడుపడలేదు. ఆ అక్కసుతోనే సాయంత్రానికల్లా పంపాల్సిన అభినందన్ ను రాత్రి వరకు వేచి ఉండేలా చేసింది. డాక్యుమెంటేషన్ పేరుతో తీవ్ర కాలయాపన చేసింది. సాధారణంగా గంట సమయంలోపే పూర్తయ్యే ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ కోసం ఒక పూటంతా వృథా చేసింది.

తమకు ఇదేమీ కొత్తగా అనిపించడంలేదని వాఘా బోర్డర్ వద్ద విధుల్లో ఉన్న బీఎస్ఎఫ్ సిబ్బంది అంటున్నారు. పాకిస్థాన్ ఇలా చేయకపోతే ఆశ్చర్యపోవాలి కానీ, ఇలా చేస్తే కొత్తేముందని అభిప్రాయపడ్డారు. ఇక, విడుదల సందర్భంగా కూడా అభినందన్ తో ఓ పర్ఫెక్ట్ వీడియో ప్లాన్ చేసింది పాకిస్థాన్ సైన్యం. ఆ వీడియోలో తమ విశాల దృక్పథాన్ని, తమ ఘనత వహించిన మానవీయతను అభినందన్ తో గొప్పగా పలికించింది.

  • Loading...

More Telugu News