Andhra Pradesh: చంద్రబాబు పేరెత్తకుండా ఏకిపారేసిన ప్రధాని మోదీ!
- పాకిస్థాన్ కు అనుకూలంగా మాట్లాడుతున్నారు
- ఇలాంటి నేతల వల్ల సైనికుల స్థయిర్యం దెబ్బతింటుంది
- విశాఖ సభలో మోదీ విమర్శలు
కేంద్ర ప్రభుత్వంలో బలమైన ప్రభుత్వం ఉంటే తమ ఆటలు సాగవని ఇక్కడి నేతలు భావిస్తున్నారంటూ సీఎం చంద్రబాబుపై ప్రధాని నరేంద్ర మోదీ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సాయంత్రం విశాఖపట్నంలోని రైల్వే గ్రౌండ్స్ లో బీజేపీ ప్రజా చైతన్య సభలో మోదీ ఎంతో ఆవేశంగా ప్రసంగించారు. మోదీ అధికారంలో ఉంటే తాము ఇష్టారాజ్యంగా నడుచుకోవడం కుదరదని ఇక్కడి నాయకులు భయపడుతున్నారంటూ విమర్శించారు.
తమ చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికే తనపై విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇక్కడి నేతలకు యూటర్న్ తీసుకోవడం బాగా అలవాటని విమర్శించారు. తనకు వ్యతిరేకంగా కూటమి కట్టిన నేతలకు ప్రత్యేకంగా అజెండా అంటూ ఏమీలేదని, నల్లధనం దాచుకున్న వారిపై చర్యలు తీసుకోవడమే వారికి కంటగింపుగా మారిందని ఆరోపించారు.
ఇక్కడి నేతలు ఎలాంటివారితో జట్టు కడుతున్నారో ప్రజలు గమనించాలని చంద్రబాబు-రాహుల్ గాంధీల మైత్రిపై పరోక్ష విమర్శ చేశారు. ఇక్కడున్న కొందరు నేతల మాటలు దారుణంగా ఉన్నాయని, వాళ్లు పాకిస్థాన్ కు మద్దతుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై కోపంతో దేశాన్ని దెబ్బతీయాలని భావిస్తున్నారని, దేశాన్ని కించపరిచే ఇలాంటి నాయకులతో ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇలాంటి నాయకుల మాటలతో దేశ సైనికుల ఆత్మస్థయిర్యం దెబ్బతింటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు తన ప్రసంగం ఆరంభంలో ప్రధాని తెలుగులో మాట్లాడి సభికులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.