India: భారత గడ్డపై అడుగుపెట్టగానే అభినందన్ కు నిర్వహించే పరీక్షలు ఇవే..!
- అభినందన్ కోసం ప్రత్యేక డాక్టర్ల బృందం
- మానసిక స్థితిపై అంచనా
- ఐబీ, రా అధికారులు ప్రశ్నించే అవకాశం
పాకిస్థాన్ కస్టడీ నుంచి విడుదలైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ అభినందన్ వర్ధమాన్ స్వదేశంలో అడుగుపెట్టేందుకు అవసరమైన ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ దాదాపు పూర్తయింది. మరికాసేపట్లో ఈ వింగ్ కమాండర్ భారత గడ్డపై కాలుమోపనున్నాడు. అయితే, పాక్ చెరలో ఉండొచ్చిన అభినందన్ కు ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అంతేకాకుండా, పాక్ కస్టడీలో ఉన్నప్పుడు అతడి నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు చిత్రహింసలు పెట్టారా? అనే కోణంలోనూ ప్రశ్నించనున్నారు. వైద్య పరీక్షల్లో భాగంగా... అభినందన్ ఫిట్ నెస్ ఎలా ఉంది? అతడి మానసిక స్థితి సవ్యంగానే ఉందా? అనే అంశాలకు ప్రాధాన్యత ఇస్తారు.
ముఖ్యంగా, పాకిస్థాన్ నిఘా సంస్థలు అభినందన్ శరీరంలో రహస్యంగా ఏమైనా ఎలక్ట్రానిక్ బగ్ లు ప్రవేశపెట్టే అవకాశం ఉండడంతో ఆ కోణంలోనూ పరీక్షలు నిర్వహిస్తారు. చివరగా, అభినందన్ కోసం ప్రశ్నావళి రూపొందించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిఘా విభాగం అడిగే ఆ ప్రశ్నలకు అభినందన్ ఇచ్చే జవాబుల ఆధారంగా అతడి మానసిక స్థితిని, ఆలోచన విధానాన్ని విశ్లేషిస్తారు. పాకిస్థాన్ సైనిక వర్గాలు మన పైలట్ నుంచి ఏమైనా కీలక సమాచారం రాబట్టారా? అన్నది కూడా ఈ సందర్భంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. కాగా, అభినందన్ నుంచి ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) వర్గాలు కూడా కొంత సమాచారం తెలుసుకునే అవకాశాలున్నాయి.