New Delhi: తమ వైఫైని ఇతరులు వాడుకుంటున్నారని దిమ్మదిరిగే యూజర్ నేమ్ సెట్ చేశాడు!
- వై-ఫై దొంగలు అదిరిపోయేలా యూజర్ నేమ్
- డేటా చోరులకు ముకుతాడు
- యూజర్ నేమ్ చూసి షాకైన పోలీసులు
దేశ రాజధాని ఢిల్లీలో ఓ ఇంటర్నెట్ వై-ఫై యూజర్ నేమ్ తీవ్ర కలకలం రేపింది. ఇటీవల పుల్వామాలో జైషే మహ్మద్ ఉగ్రదాడికి పాల్పడిన నేపథ్యంలో సదరు యూజర్ నేమ్ అందరినీ భయకంపితులను చేసింది. ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ చేసిన ఫిర్యాదుతో ఆ యూజర్ ఐడీ వెలుగులోకి వచ్చింది.
ఇంతకీ ఆ వై-ఫై కనెక్షన్ యూజర్ నేమ్ ఏంటంటే.. 'జాయిన్ హిజ్బుల్ ముజాహిదీన్'. ఈ పేరు చూసిన తర్వాత కూడా ఆ వై-ఫై కనెక్షన్ జోలికి ఎవరైనా వెళతారా! ఆ వై-ఫై కనెక్షన్ సొంతదారుకు కావాల్సింది కూడా అదే. ఇన్నాళ్లు తన వై-ఫైని అప్పనంగా ఫ్రీగా వాడేసుకున్నవాళ్లకు చెక్ పెట్టేందుకు దాని సొంతదారు దిగ్భ్రాంతి కలిగించే రీతిలో జాయిన్ హిజ్బుల్ ముజాహిదిన్ అని యూజర్ నేమ్ సెట్ చేశాడు.
అసలు.. ఇది ఎలా కనుగొన్నారంటే... ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ కనెక్షన్ గుల్షన్ తివారీ అనే 60 ఏళ్ల వ్యక్తిదని తెలుసుకున్నారు. ఆయనను అడిగితే, తన చిన్నకుమారుడు యూజర్ నేమ్ సెట్ చేసినట్టు వెల్లడించాడు. దాంతో పోలీసులు ఆ పాతికేళ్ల యువకుడిని ప్రశ్నిస్తే ఆసక్తికర విషయాలు చెప్పాడు.
తన వై-ఫై కనెక్షన్ ను కొన్నాళ్లుగా చుట్టుపక్కల వారు ఫ్రీగా ఉపయోగించుకుంటున్నారని, ఈజీగా కనెక్ట్ అవుతున్నారని వాపోయాడు. వాళ్లు తన వై-ఫై జోలికి రాకుండా ఉండాలంటే యూజర్ నేమ్ ఏదైనా భయం పుట్టించేదిగా ఉండాలని భావించి జాయిన్ హిజ్బుల్ ముజాహిదిన్ అని సెట్ చేసినట్టు తెలిపాడు. అలాంటి పేరు ఉంటే జన్మలో తమ కనెక్షన్ జోలికి రారని భావించినట్టు వివరించాడు. దాంతో అతడు చెప్పింది నిజమేనని నమ్మిన పోలీసులు ఎలాంటి కేసు లేకుండా వదిలేశారు.