India: పాక్ చెరలో ఉన్న అభినందన్ మానసిక పరిస్థితిని అంచనా వేసిన నచికేత
- అభినందన్ ధైర్యం భేష్
- వీడియోలు ప్రసారం చేసి అతడి కుటుంబాన్ని బాధపెట్టొద్దు
- మీడియా సంయమనం పాటించాలి
భారత వాయుసేన పైలెట్ అభినందన్ వర్ధమాన్ శుక్రవారం పాక్ చెర నుంచి విడుదలవుతున్న సంగతి తెలిసిందే. భారత పైలెట్ అభినందన్ ను విడుదల చేస్తున్నామంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. అయితే ఈ ప్రకటన రాకముందు కార్గిల్ వార్ హీరో నచికేత తన అభిప్రాయాలు వెల్లడించారు. ఓ సైనికుడు యుద్ధఖైదీగా పట్టుబడినప్పుడు అతని మానసిక స్థితి ఎలా ఉంటుందో తనకు అనుభవమేనని అన్నారు.
ఎంతటి హింసనైనా భరిస్తారు కానీ, యుద్ధఖైదీలుగా పట్టుబడిన రక్షణ రంగ సిబ్బంది దేశ రహస్యాలను మాత్రం బయటికి చెప్పకూడదన్న పట్టుదలతో ఉంటారని వెల్లడించారు. ఇప్పుడు అభినందన్ కూడా అదే దృఢనిశ్చయంతో కనిపిస్తున్నాడని కొనియాడారు నచికేత. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కర్తవ్య దీక్ష సడలకుండా చూసుకోవడం ఎలాగో ట్రైనింగ్ లోనే నేర్పిస్తారని వివరించారు. అభినందన్ ను వీడియోలో చూసిన తర్వాత ఒక సాహసోపేత పైలెట్ అనిపించిందని, వృత్తి పట్ల ఎనలేని అంకితభావం ఉన్న వ్యక్తిగా భావిస్తున్నట్టు తెలిపారు.
అయితే, అభినందన్ కు సంబంధించిన వీడియోల విషయంలో మీడియా సంయమనం పాటించాల్సిందని అభిప్రాయపడ్డారు నచికేత. అభినందన్ ను పాక్ సైనికులు హింసిస్తున్న వీడియోలు పదేపదే ప్రసారం చేయడంతో అతని కుటుంబ సభ్యులు తీవ్రంగా బాధపడి ఉంటారని అన్నారు. నచికేత 1999 కార్గిల్ వార్ సమయంలో భారత వాయుసేన పైలెట్. అయితే అభినందన్ తరహాలోనే నచికేత కూడా పాక్ సైన్యానికి బందీగా పట్టుబడ్డాడు. అయితే భారత్ దౌత్యమార్గాల్లో పాక్ పై ఒత్తిడి తెచ్చి నచికేతను సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చింది.