India: క్షేమంగా రావాలి... పాక్ చెరలో ఉన్న అభినందన్ కోసం యావత్ భారతావని ఆకాంక్ష
- భారత్ పైలెట్ పట్టుబడడంపై నేతల స్పందన
- ఇలాంటి వార్త వినాల్సిరావడం బాధాకరమన్న రాహుల్
- జెనీవా ఒప్పందం అమలు చేయాలంటూ ఒమర్, ఒవైసీ డిమాండ్
పాకిస్థాన్ అధీనంలో ఉన్న భారత వాయుసేన వింగ్ కమాండర్ విక్రమ్ అభినందన్ క్షేమంగా తిరిగిరావాలంటూ యావత్ భారతదేశం ఆకాంక్షిస్తోంది. బుధవారం పాక్ జెట్ ఫైటర్లు భారత గగనతలంలోకి చొచ్చుకుని రాగా, వాటికి బుద్ధి చెప్పేందుకు ఐఏఎఫ్ కు చెందిన మిగ్-21 బైసన్ యుద్ధ విమానాలు రంగంలోకి దిగాయి. అయితే వాటిలో రెండు యుద్ధ విమానాలను పాక్ కూల్చివేయగలిగింది. అందులో ఓ విమాన పైలెట్ అయిన అభినందన్ ను పాక్ దళాలు అదుపులోకి తీసుకున్నాయి. పాకిస్థాన్ నైజం తెలిసిన భారతీయులు అభినందన్ కు ఎలాంటి హాని జరగకూడదని ప్రార్థిస్తున్నారు.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ దీనిపై ట్విట్టర్ లో స్పందిస్తూ... ఇలాంటి వార్త వినాల్సి రావడం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. ఒక ధైర్యశాలి అయిన ఐఏఎఫ్ పైలెట్ శత్రుదేశానికి పట్టుబడడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. త్వరలోనే క్షేమంగా తిరిగొస్తాడని ఆశిస్తున్నట్టు ట్వీట్ చేశారు. ఇలాంటి కష్టకాలంలో భారత సాయుధ బలగాలకు మద్దతుగా నిలవాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డీఎంకే నేత స్టాలిన్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ తదితరులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జెనీవా ఒప్పందం ప్రకారం అతనిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.