India: అప్పట్లో తెలుగు పైలెట్ నచికేతను పాక్ చెర నుంచి ఎలా విడిపించారో తెలుసా!

  • కార్గిల్ యుద్ధంలో దాయాదికి దొరికిన గ్రూప్ కెప్టెన్
  • అన్ని వైపుల నుంచి ఒత్తిడితో తలొగ్గిన పాక్
  • నచికేత క్షేమంగా స్వదేశం రాక

భారత గగనతలంలోకి ప్రవేశించిన పాక్ యుద్ధ విమానాలను తరిమికొట్టే ప్రయత్నంలో మిగ్-21 బైసన్ యుద్ధవిమానం కూలిపోవడం తెలిసిందే. ఆ విమానం నడుపుతున్న పైలెట్ విక్రమ్ అభినందన్ ను పాక్ సైన్యం అదుపులోకి తీసుకుంది. అయితే 1999 కార్గిల్ వార్ సమయంలో కూడా ఓ భారత పైలెట్ పాక్ దళాల చేతచిక్కాడు. అతడి పేరు కంభంపాటి నచికేత. ఓ తెలుగువాడు. అప్పటివరకు బాంబుల వర్షం కురిపించిన నచికేత ఒక్కసారిగా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. శత్రువు పనిబడుతున్న తరుణంలో టెక్నికల్ ఫెయిల్యూర్ రావడంతో చేసేదిలేక కాక్ పిట్ లోంచి ఎజెక్ట్ అయ్యాడు. అయితే ఆ కిందపడడం పాక్ భూభాగంలో పడడంతో కళ్లు తెరిచి చూసేసరికి చుట్టూ తుపాకులు గురిపెట్టి యమకింకరుల్లా పాక్ సైనికులు కనిపించారు.

అప్పట్లో నచికేత వ్యవహారం సంచలనం సృష్టించింది. కార్గిల్ వార్ సమయంలో పాకిస్థాన్ లో నవాజ్ షరీఫ్ ప్రభుత్వం కొలువై ఉంది.  అయితే, నచికేత కోసం పాక్ లో భారత హైకమిషనర్ గా ఉన్న జి. పార్థసారథి సాహసోపేతంగా వ్యవహరించారని చెప్పాలి. పాక్ లో ఉంటూనే పాక్ ఆదేశాలను బేఖాతరు చేశారు. నచికేత పాక్ దళాలకు పట్టుబడ్డ మరుక్షణం నుంచే అంతర్జాతీయంగా ఒత్తిళ్లు మొదలయ్యాయి. జెనీవా ప్రోటోకాల్ ప్రకారం అతడిని భారత్ కు అప్పగించాలంటూ అనేక దేశాలు ఒత్తిడి చేయడంతో నచికేతను అప్పగించాలని నవాజ్ షరీఫ్ ప్రభుత్వం నిర్ణయించింది.

అయితే, భారత హైకమిషనర్ ను తమ కార్యాలయానికి పిలిపించి, అంతర్జాతీయ సమాజం ముందు భారత్ ను దోషిలా నిలబెట్టి అప్పుడు నచికేతను అప్పగించాలన్నది పాక్ దురాలోచన. ప్రణాళిక ప్రకారమే ఆయనకు పాక్ ప్రభుత్వం నుంచి సందేశం అందింది. "మా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయానికి వచ్చి మీ పైలెట్ ను తీసుకెళ్లండి" అన్నది ఆ సందేశం యొక్క సారాంశం. కానీ, ఇస్లామాబాద్ లో భారత హైకమిషనర్ గా ఉన్న పార్థసారథి అన్నింటికి తెగించారు. "మీ విదేశాంగ శాఖ కార్యాలయానికి రావాల్సిన అవసరం మాకు లేదు. భారత వాయుసేన పైలెట్ ను మీరు అవమానిస్తుంటే చూసేందుకు నేను రావాలా?" అంటూ గట్టిగా బదులిచ్చారు.

తమ దేశంలో ఉన్న భారత హైకమిషనర్ నుంచి అలాంటి సమాధానం ఊహించని పాక్ దిగ్భ్రాంతికి గురైంది. అప్పటికే ఒత్తిళ్ల తీవ్రత పెరిగిపోవడంతో వెనక్కి తగ్గిన పాక్ నచికేతను అయిష్టంగానే భారత్ కు అప్పగించింది. ఆ తర్వాత నచికేతను తీసుకుని పార్థసారథి వాఘా బోర్డర్ ద్వారా భారత్ లో అడుగుపెట్టారు. ఇప్పుడు కూడా అభినందన్ విషయంలో అంతర్జాతీయ సమాజం మద్దతు కూడగట్టి దౌత్య మార్గాల్లో పాక్ మెడలు వంచాలని భారత్ భావిస్తోంది. అందుకు జెనీవా ఒప్పందాన్ని ఆయుధంగా వాడుకోవాలని తలపోస్తోంది.

  • Loading...

More Telugu News