India: పాక్ జెనీవా ఒప్పందాన్ని పాటిస్తుందా? లేదా?

  • ప్రమాదంలో పైలెట్ అభినందన్ భవితవ్యం
  • జెనీవా ఒప్పందాన్ని పాటించాలంటూ పాక్ కు వినతుల వెల్లువ
  • దాయాది తీరు చూస్తే అభినందన్ కు కష్టకాలమే!

నిన్నటివరకు పాకిస్థాన్ పై స్పష్టమైన ఆధిక్యంలో నిలిచిన భారత్ నేడు ఒక్కసారిగా ఆత్మరక్షణ ధోరణిలో పడిపోయింది! అందుకు కారణం... మిగ్-21 బైసన్ యుద్ధ విమాన పైలెట్ పాకిస్థాన్ బలగాలకు పట్టుబడడమే. అసలే, తోకతొక్కిన తాచులా ఉన్న పాకిస్థాన్ ఇలాంటి సందర్భాలను ఎలా వినియోగించుకుంటుందో అందరికీ తెలిసిందే. పాక్ ఉన్మాద బుద్ధి తెలుసు కాబట్టే పట్టుబడ్డ పైలెట్ అభినందన్ పరిస్థితి గురించి భారత్ లో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే అభినందన్ పాక్ లో సురక్షితంగా, ఎలాంటి హింసకు గురికాకుండా ఉండాలంటే జెనీవా ఒప్పందం ఒక్కటే ఆశాదీపంలా కనిపిస్తోంది.

యుద్ధంలో పట్టుబడ్డ సైనికులు, సాధారణ పౌరుల పట్ల శత్రుదేశాలు మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని సూచించేదే జెనీవా ఒప్పందం. ఈ ఒప్పందం ప్రకారం... యుద్ధఖైదీలను బహిరంగంగా వీడియో ద్వారా ప్రదర్శించడం నిబంధనలకు విరుద్ధం. అంతేకాకుండా, అమానవీయరీతిలో హింసించడం కూడా ఒప్పందానికి వ్యతిరేకమే.

భారత వాయుసేన పైలెట్ అభినందన్ విషయంలో పాకిస్థాన్ ఈ రెండు నిబంధనలకు తూట్లు పొడిచింది. రక్తసిక్తమైన ముఖంతో ఉన్న అభినందన్ ను వీడియోలో చూపిస్తూ విస్తృతస్థాయిలో ప్రదర్శించింది. భారత పౌరులు దీనిపై ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నా, భారత ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నా... పాక్ జెనీవా ఒప్పందాన్ని గౌరవించాలని కోరుకోవడం తప్ప చేయగలిగింది ఏమీలేదు! ఇప్పటికే ఒమర్ అబ్దుల్లా, అసదుద్దీన్ ఒవైసీ వంటి నేతలు జెనీవా ఒప్పందాన్ని గౌరవించి పైలెట్ అభినందన్ పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని పాకిస్థాన్ కు విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News