Pakistan: అందుకే కూల్చేశాం... పాకిస్థాన్ ఎఫ్-16 పేల్చివేతపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వివరణ!
- విమానం కూల్చివేత వాస్తవమే
- సరిహద్దులు దాటి 3 కిలోమీటర్లు దూసుకొచ్చింది
- హెచ్చరించినా పైలట్ వినలేదన్న ఐఏఎఫ్
ఈ ఉదయం పాకిస్థాన్ కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చివేసిన విషయం వాస్తవమేనని భారత వాయుసేన వెల్లడించింది. విమానం కూలిపోతున్న సమయంలో దాన్ని నడుపుతున్న పైలట్ ప్యారాచూట్ సాయంతో తప్పించుకున్నాడని ఓ ప్రకటనలో అధికారికంగా వెల్లడించింది. సరిహద్దులను దాటిన ఆ విమానం 3 కిలోమీటర్ల దూరం చొచ్చుకు వచ్చిందని, దానికి బాంబులు కూడా అమర్చి వున్నాయని, వెంటనే వెనక్కు మళ్లాలని హెచ్చరించినా, వినక పోవడంతోనే దాన్ని క్షిపణిని ప్రయోగించి పేల్చి వేయాల్సి వచ్చిందని తెలిపింది. నౌషెరా సెష్టార్ లో దీని శకలాలు పడ్డాయని స్పష్టం చేసింది. భారత్ కు చెందిన రెండు యుద్ధ విమానాలను తాము కూల్చివేశామని పాక్ తప్పుడు ప్రచారం చేసుకుంటోందని ఎయిర్ ఫోర్స్ ఆరోపించింది. ఓ పైలట్ ను అదుపులోకి తీసుకున్నామని చేసిన ప్రకటన కూడా అవాస్తవమని చెప్పింది.