Andhra Pradesh: కౌశల్ డబ్బు మనిషి... తిరగబడిన కౌశల్ ఆర్మీ సభ్యులు!
- డబ్బున్న వాళ్ల దగ్గరకే వెళతాడు
- ఖర్చులన్నీ ఫ్యాన్స్ పైనే రుద్దుతాడు
- కౌశల్ ఆర్మీ సభ్యుల తీవ్ర ఆరోపణలు
బిగ్ బాస్ రియాల్టీ షో సెకండ్ సీజన్ ఎంత రసవత్తరంగా సాగిందో అందరికీ తెలుసు. ఓ సాధారణ మోడల్ కమ్ నటుడు అయిన కౌశల్ మందా షో ప్రారంభమైన కొన్ని రోజుల్లోనే అపూర్వ ప్రజాదరణ సొంతం చేసుకోవడం బిగ్ బాస్-2లో హైలైట్. చివరికి అతనే విజేతగా నిలవడం ఈ బిగ్గెస్ట్ రియాల్టీ షో చరిత్రలో సరికొత్త అంకం అని చెప్పాలి.
హౌస్ లోపల కౌశల్... బయట కౌశల్ ఆర్మీ... ఇతర కంటెస్టెంట్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వార్ వన్ సైడ్ అన్నట్టుగా గేమ్ ఆడేశారు. షో పూర్తయిన కొన్నిరోజుల పాటు కౌశల్ కు మహర్దశ నడిచింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కడికెళ్లినా జనాలు బ్రహ్మరథం పట్టారు. కానీ అది గతం! ఇప్పుడు కౌశల్ పై సాక్షాత్తు కౌశల్ ఆర్మీ సభ్యులే తిరుగుబాటు చేస్తున్నారు.
కౌశల్ పూర్తిగా డబ్బు మనిషి అని, డబ్బున్న అభిమానుల వద్దకే వెళతాడని కౌశల్ ఆర్మీ వ్యవస్థాపకుడైన ఇమ్మాన్ తెలిపాడు. ఓ టీవీ చానల్ తో మాట్లాడుతూ... ఏ ఈవెంట్ కు వచ్చినా కౌశల్ ఖర్చులన్నీ అభిమానులు భరించాల్సిందేనని, విమాన టికెట్లు, హోటల్ ఖర్చులన్నీ ఫ్యాన్స్ నెత్తినే పడతాయని వివరించాడు. తన గురించి ప్రశ్నించేవాళ్లను ఇతర కౌశల్ ఆర్మీ సభ్యులతో ట్రోల్ చేయిస్తాడని ఆరోపించాడు ఇమ్మాన్.
"సోషల్ మీడియాలో కొందరు నన్ను టార్గెట్ చేస్తున్నా మీరు స్పందించడంలేదు" అంటూ సానుభూతి కార్డు వేస్తాడని, దాంతో కౌశల్ ఆర్మీ సభ్యులు కొందరు రెచ్చిపోయి ట్రోలింగ్ చేస్తుంటారని కౌశల్ ప్రవర్తన ఎలాంటిదో చెప్పాడు. కౌశల్ బిగ్ బాస్ ఇంట్లో ఉన్నప్పుడు అతడిని ప్రమోట్ చేయడానికి తమ క్రెడిట్ కార్డులు మొత్తం వాడేశారని, బంగారం కుదువ పెట్టి మరీ డబ్బులు ఖర్చు చేశారని వెల్లడించాడు ఇమ్మాన్. అలాంటి వాళ్లందరూ ఇప్పుడు కౌశల్ బిహేవియర్ కారణంగా ఎంతో మనస్తాపానికి గురవుతున్నారని తెలిపాడు.
అనామిక అనే మరో యువతి కూడా కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ చేతిలో చేదు అనుభవానికి గురైంది. ఆమె కౌశల్ ఫౌండేషన్ కోసం రూ.10 వేలు డొనేట్ చేసింది. తాను ఇచ్చిన విరాళాన్ని సరిగా ఉపయోగిస్తున్నారా? అని ప్రశ్నించడమే నేరమైందని అనామిక వాపోయింది. బెంగళూరు నుంచి ఓ మహిళ ఫోన్ చేసి.. నీ పది వేలు ఇచ్చేస్తాం, మూసుకుని కూర్చో అంటూ అభ్యంతరకరంగా మాట్లాడినట్టు తెలిపింది.