India: ఇక మీ వంతు... సర్ ప్రైజ్ కు సిద్ధంగా ఉండండి!: భారత్ ను హెచ్చరించిన పాక్ సైన్యం
- మా తడఖా ఏంటో చూపిస్తాం
- సైనిక జనరల్ ఆసిఫ్ గఫూర్ వీరావేశం
- ఇమ్రాన్ అధ్యక్షతన ఎన్సీఏ సమావేశం
కనీసం ప్రత్యర్థి తేరుకునే అవకాశం కూడా ఇవ్వకుండా భారత వాయుసేన నిర్వహించిన సర్జికల్ స్ట్రయిక్స్ పాకిస్థాన్ ను నిశ్చేష్టురాలిని చేశాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని కీలకప్రాంతాల్లో భారత్ చేపట్టిన లక్షిత దాడుల్లో 350 మంది ఉగ్రవాదులు హతులైనట్టు సమాచారం. ఖాళీ ప్రదేశాల్లో బాంబులు వేశారని పాక్ చెప్పుకుంటున్నా వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని తెలుస్తోంది.
అయితే భారత్ మెరుపుదాడులు చేయడాన్ని పాక్ ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణిస్తోంది. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనివిధంగా నేషనల్ కమాండ్ అథారిటీ (ఎన్సీఏ) ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షతన అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేయడమే అందుకు నిదర్శనం. పాకిస్థాన్ అణ్వాయుధ కార్యక్రమాలన్నీ ఎన్సీఏ పర్యవేక్షణలోనే ఉంటాయి. అలాంటి కీలక వ్యవస్థ అత్యవసరంగా సమావేశం కావడంతో పాకిస్థాన్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దీనిపై పాకిస్థాన్ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ మాట్లాడుతూ... "ఇక మీ వంతు... కాచుకోండి! సర్ ప్రైజ్ అందుకోవడానికి సిద్ధం కండి. ఎన్సీఏ ఎందుకు సమావేశం అయిందో త్వరలోనే మీకు తెలుస్తుంది. సర్వశక్తిమంతుడు అల్లా అంతా చూస్తున్నాడు. భారత విమానాలు పాకిస్థాన్ గగనతలంలో 21 నిమిషాల పాటు విహరించాయా?... తర్వాత ఏం జరుగుతుందో కూడా చూస్తాం" అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి పరిస్థితికైనా సిద్ధంగా ఉండాలంటూ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే ప్రజలకు స్పష్టమైన సందేశం ఇచ్చిన నేపథ్యంలో జనరల్ గఫూర్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.