ntr: అన్నగారు కూడా మేకప్ వేసుకోని రోజులు వున్నాయి: పరుచూరి గోపాలకృష్ణ
- 'బడిపంతులు'కి ముందు గ్యాప్ వచ్చింది
- 'తాత మనవడు' చేయనని చెప్పారు
- ఆ తరువాత వెనుదిరిగి చూసుకోలేదు
తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, ఎన్టీఆర్ గురించిన ఒక ఆసక్తికరమైన విషయం చెప్పుకొచ్చారు. 'నా దేశం' .. 'చండశాసనుడు' సినిమాల సమయంలో నేను అన్నగారితోనే ఉండేవాడిని. ఒకసారి అన్నగారు 'సినిమా పరిశ్రమ ఒక రంగుల లోకం .. ఎప్పుడు ఏ రంగు వెలిసిపోతుందో తెలియదు' అన్నారు. ఆయన అది ఏ ఉద్దేశంతో అన్నారో తెలుసుకోవడానికి ప్రయత్నించాను.
అప్పుడు ఆయన .. "నెంబర్ వన్ స్టార్ కూడా పనిలేకుండా కూర్చునే రోజులు ఇండస్ట్రీలో ఉంటాయి. నేను మేకప్ వేయకుండా చాలా రోజుల పాటు ఇంట్లో కూర్చున్నానంటే మీరు నమ్ముతారా? 'బడి పంతులు'కి ముందు అలాంటి పరిస్థితిని చూశాను" అన్నారు. ఆ సమయంలో అసలు సినిమా అవకాశాలు లేకుండా అలా కూర్చున్నారట.
అలాంటి పరిస్థితుల్లోనే 'తాత మనవడు'లో చేయమంటూ దాసరి గారు వచ్చి కథ చెప్పారట. అందులో తాత .. హీరో కాదు గనుక వేయనని చెప్పిన అన్నగారు, 'బడిపంతులు'లో తాత పాత్ర హీరో కనుక వేశానని అన్నారు. 'బడిపంతులు' తరువాత ఎన్టీఆర్ గారి కెరియర్ ఒక రేంజ్ లో దూసుకెళ్లిందని పరుచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు.