pm: మాతృదేశంపై ఒట్టేసి చెబుతున్నా..దేశాన్ని ఎవరి ముందు తలదించనివ్వను: ప్రధాని మోదీ
- మెరుపు దాడుల వీరులకు నమస్కరిద్దాం
- దేశానికి, జాతికి ఎన్నటికీ తలవంపులు తీసుకురాను
- జాతి ప్రయాణం ఆగదు, విజయయాత్ర కొనసాగుతుంది
మాతృదేశంపై ఒట్టేసి చెబుతున్నా..దేశాన్ని ఎవరి ముందు తలదించనివ్వను అని ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగ ప్రసంగం చేశారు. రాజస్థాన్ లోని చురులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, మెరుపు దాడుల వీరులకు నమస్కరిద్దాం అని అన్నారు. భారత్ సురక్షితమైన చేతుల్లో ఉందన్న విశ్వాసాన్ని ఇస్తున్నానని, దేశానికి, జాతికి ఎన్నటికీ తలవంపులు తీసుకురానని, జాతి ప్రయాణం ఆగదు, విజయయాత్ర కొనసాగుతుందని చెప్పారు.
‘జై జవాన్-జై కిసాన్’ నినాదంతో ముందుకు సాగుతున్నామని,వ్యక్తి కన్నా పార్టీ గొప్పది, పార్టీ కన్నా దేశం గొప్పదన్న భావనతో పని చేస్తున్నామని అన్నారు. భారతావని ఎప్పుడూ తలఎత్తుకునే ఉంటుందని, దేశం మేల్కొని ఉంది, ప్రతి భారతీయుడికి విజయం లభిస్తుందని అన్నారు. జాతి నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ప్రధాన సేవకుడిలా నమస్కరిస్తున్నానని, దేశ రక్షణలో అమరులైన సైనికుల స్మృత్యర్థం నిన్న యుద్ధ స్మారకం ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేశారు.
ఈ రాష్ట్రానికి చెందిన అనేక మంది యువకులు సరిహద్దుల్లో కాపలాగా నిలబడ్డారని, ఇది మనందరికీ గర్వకారణమని అన్నారు. కాగా,పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన దళాలు, యుద్ధ విమానాలతో దూసుకెళ్లి బాంబులేసి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ భావోద్వేగ ప్రసంగం చేశారు.