Train Accident: జనగామ జిల్లాలో రైలు ప్రమాదం... నాగపూర్ లో లభ్యమైన తల!
- రఘునాధపల్లి వద్ద లభ్యమైన మొండెం
- 400 కిలోమీటర్ల దూరంలో రైలు బోగీకి తల
- మృతుడెవరో తెలియదంటున్న పోలీసులు
జనగామ జిల్లా రఘునాథపల్లి శివార్లలో రైలు పట్టాల పక్కన కనిపించిన తల లేని శరీర భాగాలు కనిపించి, తీవ్ర కలకలం రేపగా, అక్కడికి 400 కిలోమీటర్ల దూరంలో తల లభ్యమైంది. రెండు రాష్ట్రాల పోలీసులను పరుగులు పెట్టించిన ఈ ఘటన పూర్వాపరాల్లోకి వెళితే, శనివారం రాత్రి సికింద్రాబాద్ నుంచి నాగ్‌పుర్ వెళ్లే నాగపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లో కూర్చునేందుకు సీటు లభించని ఓ యువకుడు (వయసు 25 నుంచి 30 ఏళ్లు ఉండవచ్చు) మెట్లపై కూర్చుని ప్రయాణిస్తుండగా, ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం రైల్వే పోలీసులు నుజ్జయిన శరీర భాగాలను గుర్తించి, తల కోసం ఎంతగా ప్రయత్నించినా, అది లభించలేదు. దీంతో వారు శరీర భాగాలను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
ఇక సోమవారం నాడు, నాగపుర్ రైల్వే స్టేషన్ లో రైలు బోగీ మెట్లకు ఓ తల చిక్కుకుని ఉన్న విషయాన్ని గమనించిన అక్కడి పోలీసులు, ఇది హత్యా? లేక ప్రమాదమా? అన్న కోణంలో దర్యాఫ్తు ప్రారంభించి, ఆ రైలు ప్రయాణించిన మార్గంలోని అన్ని స్టేషన్లనూ అప్రమత్తం చేయగా, ఇక్కడి పోలీసులు స్పందించారు. తలకు అతుక్కుని ఉన్న బనియన్ ముక్కలు, మృతుడు ధరించిన బనియన్ ఒకటేనని గుర్తించి, ఇది ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనగా తేల్చారు. తలను తెచ్చి మొండేనికి అతికించి, అతను ఎవరన్న విషయాన్ని తేల్చే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ప్రస్తుతానికి మృతుడికి సంబంధించిన వివరాలేవీ తెలియరాలేదని కాజీపేట పోలీసులు వెల్లడించారు.