India: ఈసారి వర్షపాతం సాధారణమే!
- అసాధారణ వర్షపాతం ఉండకపోవచ్చు
- 2019 వర్షపాతం ముందస్తు అంచనా
- స్కైమెట్ వెల్లడి
దేశానికి అన్నం పెట్టే రైతన్నకు రుతుపవనాలు ఎన్నో ఆశలు కల్పిస్తుంటాయి. కనీసం ఓ మోస్తరు వర్షపాతం నమోదైనా చాలు... తిండిగింజలైనా పండిస్తాం అంటూ ప్రతి రైతు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తుంటారు. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో గత దశాబ్దకాలంగా భారత్ లో వర్షపాత సరళి అస్తవ్యస్తంగా మారింది. కొన్ని ప్రదేశాల్లో అతివృష్టి, మరికొన్ని చోట్ల అనావృష్టి అన్నట్టుగా తయారైంది. భారత్ లో 70 శాతం వర్షాలు రుతుపవనాల కారణంగానే కురుస్తాయి. భారత ఆర్థిక వ్యవస్థ సైతం మాన్సూన్ సీజన్ పైనే ఆధారపడి ఉంటుందంటే అతిశయోక్తి కాదు.
ఈ నేపథ్యంలో దేశంలోని ఏకైక ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ 2019లో వర్షపాతం ఎలా ఉంటుందో ఓ నివేదికలో తెలిపింది. జూన్ నుంచి మొదలయ్యే నాలుగు నెలల వర్షాకాలంలో ఈసారి సాధారణ వర్షపాతం ఉంటుందని వెల్లడించింది. అంటే, ఏభై ఏళ్ల సగటు అయిన 89 సెంటీ మీటర్ల వర్షపాతంలో 96 శాతం నుంచి 104 శాతం మధ్య వర్షాలు కురిస్తే దాన్ని సాధారణ స్థాయి అని భావిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో 2019 సీజన్ కు గాను సాధారణ వర్షపాతం కురిసేందుకు 50 శాతం మించి అవకాశాలున్నాయని స్కైమెట్ వివరించింది.