Vijayawada: మాజీ మేయర్ మల్లికా బేగం ఎఫెక్ట్.. జలీల్ ఖాన్ కూతురుకి ఫత్వా జారీ
- బురఖా లేకుండా మహిళలు రాజకీయాల్లోకి రాకూడదు
- మతపెద్ద మౌలానా అబ్దుల్ ఖదీర్ రిజ్వి ఫత్వా
- నాడు మల్లికా బేగంపై ఫత్వా జారీ చేయించిన జలీల్
విజయవాడ పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూతురు షబానా ఖాతూన్ కు మత పెద్దలు ఫత్వా జారీ చేశారు. ఇస్లాం ప్రకారం బురఖా లేకుండా మహిళలు రాజకీయాల్లోకి రాకూడదని ఆ ఫత్వాలో ఆదేశించారు.
కాగా, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న షబానాకు ఫత్వా జారీ కావడం వెనుక మాజీ మేయర్ మల్లికా బేగంకు జరిగిన అన్యాయమే కారణమని సమాచారం. 2009 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తరపున టికెట్ ఆశించి జలీల్ ఖాన్ భంగపడ్డారు. జలీల్ ఖాన్ స్థానంలో మాజీ మేయర్ మల్లికా బేగంను పోటీకి దించారు. అయితే, ఇస్లాం నిబంధనల ప్రకారం బురఖా లేకుండా మహిళలు రాజకీయాల్లోకి రాకూడదనే కారణంతో మల్లికా బేగంపై ఫత్వా జారీ చేయించేలా మతపెద్దలపై జలీల్ ఖాన్ ఒత్తిడి తెచ్చారు.
ప్రస్తుత విషయానికొస్తే, తనకు లాగే షబానాపై కూడా ఫత్వా జారీ చేయాలని మతపెద్దలపై మల్లికా బేగం ఒత్తిడి చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మతపెద్ద మౌలానా అబ్దుల్ ఖదీర్ రిజ్వి ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.