Cricket: వైజాగ్ లో ఆపసోపాలు పడిన భారత బ్యాట్స్ మెన్.. ఆసీస్ లక్ష్యం 127 పరుగులు
- కేఎల్ రాహుల్ అర్ధసెంచరీ
- 3 పరుగులకే పంత్ అవుట్
- బ్యాటింగ్ లో ఇబ్బందిపడిన ధోనీ
ఆస్ట్రేలియా జట్టుతో మొదటి టి20 మ్యాచ్ లో టీమిండియా 127 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. మొదట టాస్ గెలిచిన ఆసీస్ ఆతిథ్య జట్టుకు బ్యాటింగ్ అప్పగించింది. అయితే ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేయగలిగింది. టీమిండియా ఇన్నింగ్స్ లో ఓపెనర్ కేఎల్ రాహుల్ టాప్ స్కోరర్. రాహుల్ 36 బంతుల్లో 50 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ 5 పరుగులు చేసి అవుట్ కాగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ 24 పరుగులు సాధించాడు.
ఇక, వైజాగ్ పిచ్ అంటే రెచ్చిపోయి ఆడే ఎంఎస్ ధోనీ వరుసగా వికెట్లు పడతుండడంతో ధాటిగా బ్యాటింగ్ చేయలేకపోయాడు. చివరివరకు క్రీజులో నిలిచిన ధోనీ 37 బంతులాడి 29 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న డాషింగ్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ 3 పరుగులు మాత్రమే చేయడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ కౌల్టర్ నైల్ అత్యధికంగా 3 వికెట్లు తీశాడు.