Russia: ఏకే-47 సృష్టికర్తల నుంచి సరికొత్త అస్త్రం
- ఆత్మాహుతి డ్రోన్ కు రూపకల్పన
- అబుదాబి ఆయుధ ఎక్స్ పోలో ప్రధానాకర్షణ ఇదే
- నిపుణులను ఆకర్షిస్తున్న విలక్షణ ఆయుధం
ఆధునిక ప్రపంచంలో ఏకే-47 గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది అస్సాల్ట్ కేటగిరీ రైఫిల్. చాలా తేలిగ్గా ఉండడంతో పాటు స్వల్ప వ్యవధిలో బుల్లెట్ల వర్షం కురిపించే సత్తా దీని సొంతం. ఆయా దేశాల సైన్యాలతో పాటు ఉగ్రవాదులకు కూడా ఇది నమ్మకమైన నేస్తంగా పేరుతెచ్చుకుంది. ఈ తుపాకీని రష్యా నిపుణుడు కలాష్నికోవ్ రూపొందించడంతో ఆయన పేరుమీదుగా అవటోమాట్ కలాష్నికోవ్ (ఏకే) అని నామకరణం చేశారు.
ఇది రూపుదిద్దుకున్న సంవత్సరం కూడా జతచేసి ఏకే-47 అంటూ సంక్షిప్తంగా పిలుచుకుంటారు. ఆ తర్వాత ఓ సంస్థగా ఏర్పడిన కలాష్నికోవ్ గ్రూప్ ఇప్పుడు మరో అద్భుతమైన ఆవిష్కరణతో అంతర్జాతీయ సమాజం ముందుకొచ్చింది. ఆత్మాహుతి దాడులు చేయగల అత్యాధునిక డ్రోన్ కు రూపకల్పన చేసింది. ఎంతో చవకగా లభించే ఈ సూసైడ్ డ్రోన్ కారణంగా యుద్ధరంగం సరికొత్త రూపు సంతరించుకోవడం ఖాయమని భద్రత రంగ నిపుణులు భావిస్తున్నారు.
అబుదాబిలో ఈ వారం జరిగిన అంతర్జాతీయ ఆయుధ ప్రదర్శనలో ఈ విలక్షణ డ్రోన్ ను ప్రదర్శించారు. ఈ డ్రోన్ కు కుబ్-యూఏవీ అని నామకరణం చేశారు. దీన్ని ఆపరేట్ చేయడం చాలా సులువని, పైగా ధర కూడా చాలా తక్కువని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. నాలుగు అడుగుల వెడల్పు ఉండే ఈ డ్రోన్ 80 మైళ్ల వేగంతో కనీసం 30 నిమిషాల పాటు గాల్లో విహరించగలదు.
అదే సమయంలో 6 పౌండ్ల పేలుడు పదార్ధాలను తనతో తీసుకెళ్లగలిగే సత్తా దీని సొంతం. దీన్ని 40 మైళ్ల దూరం నుంచి కూడా నియంత్రించే వీలుంది. ఈ డ్రోన్ ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో కీలక ఆపరేషన్లు నిర్వహించేందుకు అనుకూలంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే, ఏకే-47లా కాకుండా ఉగ్రవాదుల్లో చేతుల్లో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.