Pakistan: మేం ఒక్క అణుబాంబు వేస్తే భారత్ 20 అణుబాంబులతో మా కథ ముగిస్తుంది!: ముషారఫ్
- భారత్-పాక్ సంబంధాలు ప్రమాదంలో పడ్డాయి
- అణుదాడులు వద్దంటూ హితవు
- తాజా పరిస్థితిపై ముషారఫ్ ఆందోళన
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ప్రస్తుత పరిస్థితులపై తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో నిర్వహించిన ఓ పత్రికా సమావేశంలో ఆయన తన అభిప్రాయాలు వెల్లడించారు. తాము ఒక్క అణుబాంబు వేస్తే చాలు, భారత్ 20 అణుబాంబులతో పాకిస్థాన్ ను భస్మీపటలం చేస్తుందని అభిప్రాయపడ్డారు.
'అయితే దీనికున్న ఏకైక పరిష్కారం ఏమిటంటే, భారత్ పై పాక్ దాడిచేయాలనుకుంటే ముందుగా ఏకంగా 50 అణుబాంబులు వేయాల్సి ఉంటుంది. ఆ దెబ్బతో భారత్ తిరిగి అణుదాడికి దిగలేదు, ఇంకప్పుడు 20 అణుబాంబులతో దాడిచేసే ప్రసక్తే ఉండదు' అని వ్యాఖ్యానించారు. మరి 50 అణుబాంబులతో దాడికి దిగుతారా? అంటూ పాకిస్థాన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ముషారఫ్.
అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో అణ్వాయుధ దాడికి దిగకపోవడమే మంచిదని ముషారఫ్ హితవు పలికారు. ఏమైనా భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య సంబంధాలు మరోసారి ప్రమాదకరస్థాయికి చేరాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పుల్వామా ఆత్మాహుతి దాడి నేపథ్యంలో పాక్ మాజీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గతంలో భారత్ లో ఎన్ని ఉగ్రదాడులు జరిగినా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయే తప్ప ఇలా అణుదాడుల ప్రస్తావన ఎప్పుడూ రాలేదు.