Andhra Pradesh: కరాచీ బేకరికి వ్యతిరేకంగా నిరసనలు.. తీవ్రంగా మండిపడ్డ బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు!
- పుల్వామా ఉగ్రదాడితో ఆందోళనలు ఉద్ధృతం
- బెంగళూరులో కరాచీ బేకరి ఎదుట మూకల ఆందోళన
- ఈ మూర్ఖపు చర్యలను ముక్తకంఠంతో ఖండించాలన్న ఐవైఆర్
జమ్మూకశ్మీర్ లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్ పై ఉగ్రదాడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కొందరు దుండగులు మాత్రం కశ్మీర్ విద్యార్థులపై దాడికి పాల్పడ్డారు. మరికొందరేమో బెంగళూరులోని కరాచీ బేకరి షాపుల ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో తమపై దాడులు జరుతాయని భయపడ్డ కరాచీ బేకరి యాజమాన్యం.. షాపు బోర్డులో కరాచీ(పాకిస్తాన్ లోని ఓ నగరం) అనే పదం కనిపించకుండా చర్యలు తీసుకుంది.
తాజాగా ఈ ఆందోళనకారుల చర్యను బీజేపీ నేత, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఖండించారు. ఈరోజు ట్విట్టర్ లో ఆయన స్పందిస్తూ..‘రండి.ఈ మూర్ఖపు చర్యలను ముక్తకంఠంతో ఖండిద్దాం. భారత ఉపఖండపు సంస్కృతి రాజకీయ సరిహద్దుల కంటే విస్తృతమైనది. రాజకీయంగా విభజింపబడినా ఈ ఉపఖండం భౌగోళికంగా, సాంస్కృతికంగా ఒక్కటే. ఈ పనికిమాలిన చర్యలను అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది’ అని ట్వీట్ చేశారు.