Jagan: వైసీపీ ఇన్‌చార్జ్‌లా కేటీఆర్.. వందమంది కేటీఆర్‌లు వచ్చినా టీడీపీ విజయాన్ని అడ్డుకోలేరు: అచ్చెన్నాయుడు

  • జగన్ లండన్ వెళ్తూ పార్టీని కేటీఆర్‌కు అప్పగించినట్టున్నారు
  • వైసీపీ-టీఆర్ఎస్ బంధం బయటపడింది
  • కేటీఆర్‌కు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలి

టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీ అధినేత లండన్ వెళ్తూవెళ్తూ పార్టీ బాధ్యతలను కేటీఆర్‌కు ఇచ్చి వెళ్లినట్టు ఉన్నారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓడిపోవడం వంద శాతం పక్కా అని, జగన్ గెలుపు ఖాయమన్న కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ-టీఆర్ఎస్ మధ్య కొనసాగుతున్న రహస్య బంధం కేటీఆర్ వ్యాఖ్యలతో మరోమారు బయటపడిందని అచ్చెన్నాయుడు అన్నారు. ఏపీలో శాంతిభద్రతలను విచ్ఛిన్నం చేసేందుకు ఈ రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.  

లోటు బడ్జెట్‌లో ఉండి కూడా ఏపీలో నూటికి నూరుశాతం ఇచ్చిన హామీలను నెరవేర్చామన్న అచ్చెన్నాయుడు.. మిగులు బడ్జెట్‌లో ఉండి కూడా తెలంగాణలో ఇచ్చిన హామీలను 40 శాతం కూడా నెరవేర్చలేకపోయారని కేటీఆర్‌ను విమర్శించారు. తెలంగాణలో కంటే ఏపీలోనే మెరుగైన పాలన ప్రజలకు అందుతోందన్నారు. కేటీఆర్-జగన్ కలిసి ఏపీలో కుట్రలకు పాల్పడుతున్నారని, వందమంది కేటీఆర్‌లు, జగన్‌లు వచ్చినా రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్‌కు దమ్ముంటే గత ఐదేళ్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని అచ్చెన్నాయుడు సవాలు విసిరారు.  

  • Loading...

More Telugu News