Narendra Modi: ఇమ్రాన్ ఖాన్ తన మాట మీద నిలబడతాడా? లేదా? అన్నది పరీక్షించే సమయం ఆసన్నమైంది!: మోదీ
- రాజస్థాన్ లో నిప్పులు చెరిగిన ప్రధాని
- ఇమ్రాన్ నాకు మాటిచ్చాడు
- మాట నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చింది
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాకిస్థాన్ అంటే మండిపడుతున్నారు. పుల్వామా ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి ఆయన పాక్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ పుల్వామా దాడికి బాధ్యత తమదే అని ప్రకటిస్తే, పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇప్పటివరకు దాడిని ఖండించకపోవడాన్ని మోదీ తీవ్రంగా గర్హిస్తున్నారు.
రాజస్థాన్ లోని టోంక్ ప్రాంతంలో శనివారం జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ, పాకిస్థాన్ కు కొత్త ప్రధాని వచ్చారని తెలియగానే ఆయన (ఇమ్రాన్ ఖాన్)ను మనస్ఫూర్తిగా అభినందించానని తెలిపారు. "మనం దారిద్ర్యంపైనా, నిరక్షరాస్యతపైనా పోరాడుదాం అంటూ స్నేహహస్తం చాచాను. అప్పుడు ఇమ్రాన్ ఖాన్... నేను పఠాన్ బిడ్డను, ఆడిన మాట తప్పను... అంటూ చెప్పాడు. ఇప్పుడా మాట నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చింది ఇమ్రాన్ ఖాన్... మాట మీద నిలబడతావో మాట తప్పుతావో తేల్చుకో" అంటూ ఆవేశభరిత వ్యాఖ్యలు చేశారు.