UBER: ఈట్స్ భారత్ విభాగాన్ని అమ్మకానికి పెట్టిన ఉబర్...స్విగ్గీ, జొమాటోతో బేరసారాలు
- కేవలం 10 శాతం వాటాకు పరిమితం కానున్న ఉబర్
- షేర్ల మార్పిడి ద్వారా ప్రక్రియ పూర్తి
- నెల రోజుల్లో వ్యవహారం పూర్తవుతుందని అంచనా
ప్రముఖ రవాణా వాహనాల సరఫరా సంస్థ ఉబర్ తన అనుబంధ ‘ఉబర్ ఈట్స్’ భారత్ విభాగాన్ని అమ్మకానికి పెడుతోంది. ప్రముఖ ఆహారం డోర్ డెలివరీ సరఫరా సంస్థ స్విగ్గీకి ఈ విభాగాన్ని అమ్ముతున్నట్లు ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఒకటి వెల్లడించింది. ఇప్పటికే జరిగిన చర్చల మేరకు షేర్లు బదిలీ ప్రక్రియలో జరగనున్న ఈ ఒప్పందం తర్వాత కేవలం 10 శాతం వాటాను మాత్రమే తనవద్ద అట్టేపెట్టుకుని మిగిలిన దాన్ని వదులుకునేందుకు ఉబర్ సిద్ధమవుతోందని సమాచారం.
అయితే ఉబర్ ఈట్స్ను సొంతం చేసుకునేందుకు మరో ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కూడా పోటీ పడుతున్నట్లు ఈ కథనం పేర్కొంది. ప్రస్తుతానికి ఈ రెండు సంస్థలు ఉబర్ ఈట్స్ భారత్ విభాగాన్ని సొంతం చేసుకునేందుకు పోటీ పడుతున్నప్పటికీ స్విగ్గీతో ఒప్పందానికి ఉబర్ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ఒప్పందం ప్రక్రియ మార్చి నెలలో పూర్తవుతుందని అధికార వర్గాల కథనంగా పత్రిక పేర్కొంది. అయితే ఈ ఒప్పందం విషయమై స్విగ్గీ, ఉబర్ సంస్థల ప్రతినిధులు మాత్రం స్పందించడం లేదు.