Tamil Nadu: తమిళనాడు రోడ్డు ప్రమాదంలో విల్లుపురం ఎంపీ రాజేంద్రన్ దుర్మరణం
- అతను ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో విషాదం
- ఘటనా స్థలిలోనే ప్రాణాలు కోల్పోయిన లోక్‌సభ సభ్యుడు
- విల్లుపురం సమీపంలోని తిండివనమ్ వద్ద ప్రమాదం
తమిళనాడులోని విల్లుపురం లోక్‌సభ సభ్యుడు, అన్నాడీఎంకే పార్టీకి చెందిన ఎస్.రాజేంద్రన్ (62) ఈ రోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో దర్మరణం పాలయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న స్పోర్ట్స్ కారు డ్రైవర్ రోడ్డుపై ఉన్న స్టాప్ బోర్డును తప్పించే ప్రయత్నంలో వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. విల్లుపురం జిల్లా తిండివనమ్ సమీపంలో ఈరోజు ఉదయం 6 గంటలకు జరిగిన ఈ ఘటనలో కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. జక్కంపెట్టాయి అతిథిగృహంలో తన సహచరులు, పార్టీ ప్రతినిధులను కలిసిన అనంతరం ఎంపీ ఇంటికి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.
తీవ్రంగా గాయపడిన ఎంపీ రాజేంద్రన్ ఘటనా స్థలిలోనే చనిపోయారు. ప్రమాదంలో కారు డ్రైవర్‌తోపాటు ఎంపీ సహాయకుడు తీవ్రగాయాల పాలయ్యారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విల్లుపురం నియోజకవర్గం నుంచి రాజేంద్రన్ ఏఐడీఎంకే తరపున పోటీ చేసి గెలుపొందారు. తొలిసారి ఎంపీగా గెలుపొందిన రాజేంద్రన్.. ఎరువులు, రసాయనాలు స్టాండింగ్ కమిటీలోను, పౌర విమానయాన శాఖలోని ఓ కమిటీలోను సభ్యుడిగా ఉన్నారు. రాజేంద్రన్ హఠాన్మరణంపై ఏఐఏడీఎంకే నేతలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.