India: ఐక్యరాజ్యసమితి సాక్షిగా చైనా వంకర బుద్ధి మరోసారి బట్టబయలు!
- 'పుల్వామా' ప్రకటన ఆపేందుకు కుయుక్తులు
- పాక్ తో కలిసి విఫలయత్నాలు
- అయినా పైచేయి సాధించిన భారత్
భారత్ కు కంట్లో నలుసులా ఇబ్బంది పెట్టే దేశం చైనా. తనకున్న ఆర్థికబలంతో పాకిస్థాన్ ను మచ్చిక చేసుకున్న ఈ ఆసియా పెద్దన్న భారత్ ను నయానో భయానో లొంగదీసుకోవాలని చేయని ప్రయత్నం అంటూలేదు. అయితే, బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతీక అయిన భారత్ ఇప్పటివరకు చైనాకు ఏ విధంగానూ దాసోహం అనలేదు. అదే చైనాకు కంటగింపుగా మారింది. ఇప్పుడు పుల్వామా ఘటనపై కూడా చైనా ఎంతో ఇబ్బందికరంగా ప్రవర్తిస్తోంది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ఈ ఉగ్రదాడిని ఖండిస్తూ ప్రకటన చేయాల్సి వచ్చినప్పుడు కూడా తనకున్న అధికారంతో ఆ ప్రకటనను వాయిదా వేయించగలిగింది చైనా.
15 శాశ్వత, తాత్కాలిక సభ్యుదేశాలతో కూడిన భద్రతామండలి... పుల్వామాలో జైషే మహ్మద్ ఉగ్రదాడిని తీవ్ర పదజాలంతో ఖండిస్తూ ఫిబ్రవరి 14న ప్రకటన చేయాలని సంకల్పించింది. కానీ, చైనా దీనికి మోకాలడ్డింది. ఈ అంశంపై తగిన విధంగా స్పందించేందుకు తమకు సమయం కావాలంటూ పదేపదే కోరింది. దాంతో చైనా ఫిబ్రవరి 18 వరకు గడువు పొడిగించాలని కోరినా, మిగతా 14 సభ్యదేశాలు ఫిబ్రవరి 15వ తేదీనే ప్రకటన చేసేందుకు సిద్ధపడ్డాయి.
ఓవైపు చైనా, పాకిస్థాన్ లు ఈ ప్రకటనను అడ్డుకునేందుకు సర్వశక్తులు ఒడ్డినా ఎట్టకేలకు ఫిబ్రవరి 21న భద్రతామండలి పుల్వామా ఘటనను తీవ్రంగా ఖండిస్తూ ప్రకటన చేసింది. అంతర్జాతీయ వేదికపై భారత్ సాధించిన విజయంగా దీన్ని అభివర్ణించవచ్చు. జమ్మూకశ్మీర్ లో ఎంతో కాలంగా భద్రతాబలగాలపై జరుగుతున్న దాడులను ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ఖండించడం చరిత్రలో ఇదే ప్రథమం.
ఈ ప్రకటన వెలువడేందుకు అగ్రరాజ్యం అమెరికా ఎంతో కృషి చేసినట్టు భారత దౌత్యవర్గాలు వెల్లడించాయి. ప్రకటనలో కొన్ని సర్దుబాట్లు ఉన్నా భద్రతామండలి సభ్యదేశాలను ఒప్పించడంలో అమెరికా పాత్ర ఎనలేనిదని భారత వర్గాలు కొనియాడాయి. భద్రతామండలి ప్రకటనను నీరుగార్చేందుకు చైనా ఎన్ని కుయుక్తులు పన్నినా, సమితిలో పాకిస్థాన్ శాశ్వత ప్రతినిధి మలీహా లోధీ భద్రతామండలి ప్రెసిడెంట్ ను కలిసినా భారత దౌత్యనీతి ముందు దిగదుడుపే అయింది.
పుల్వామా దాడిని ఖండిస్తూ భద్రతామండలి చేసిన విస్పష్ట ప్రకటన పాకిస్థాన్, దానికి కొమ్ముకాస్తున్న చైనాకు చెంపపెట్టులాంటిదని చెప్పాలి. అయితే చైనా ఎప్పట్లాగానే తన వంకర బుద్ధిని ఘనంగా ప్రదర్శించింది! గురువారం భద్రతామండలి చేసిన ప్రకటన ఓ ఉగ్రవాద సంస్థపై సాధారణ అంశాల ప్రాతిపదికన చేసినట్టుగా భావించాలని, ఇదేమీ పుల్వామా దాడి ఘటనపై అంతిమ తీర్పుగా భావించరాదని శుక్రవారం హడావుడిగా ఓ ప్రకటన వెలువరించింది.