Andhra Pradesh: ముఖ్యమంత్రులే కాదు.. బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ప్రధానమంత్రులు కూడా ఉన్నారు!
- జవహర్ లాల్ నెహ్రూతో మొదలైన సంప్రదాయం
- అనుసరించిన ఇందిరా గాంధీ, రాజీవ్
- ఆర్థికశాఖను నిర్వహించినా బడ్జెట్ ప్రవేశపెట్టని మన్మోహన్ సింగ్
ముఖ్యమంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి తెలంగాణ సీఎంగా కేసీఆర్ ఈరోజు రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ తో పాటు రోశయ్య, కాసు బ్రహ్మానంద రెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి సైతం సీఎం హోదాలో బడ్జెట్ ను శానససభ ముందు ఉంచారు. అయితే ముఖ్యమంత్రులే కాకుండా ప్రధానులు సైతం ఆర్థిక శాఖను నిర్వహిస్తూ పార్లమెంటులో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన దాఖలాలు ఉన్నాయి.
స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, ఆయన కుమార్తె ఇందిరాగాంధీ, ఇందిర కుమారుడు రాజీవ్ గాంధీ ప్రధానులుగా ఉన్నప్పుడు ఆర్థిక శాఖను స్వయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంటులో బడ్జెట్ ను సమర్పించారు. 1958-59 ఆర్థిక సంవత్సరానికి జవహర్ లాల్ నెహ్రూ బడ్జెట్ ను పార్లమెంటు ముందు ప్రవేశపెట్టారు.
ఆయన తర్వాత ఇందిరాగాంధీ 1970-71 సంవత్సరానికి, రాజీవ్ గాంధీ 1987-88 కాలానికి బడ్జెట్ ను సమర్పించారు. యూపీఏ-1 హయాంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ కూడా కొద్దికాలం ఆర్థిక శాఖను నిర్వహించారు. అయితే మన్మోహన్ సింగ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టాల్సిన అవసరం రాలేదు.