AMB cinemas: జీఎస్టీ దాడులతో దిగొచ్చిన మహేశ్ బాబు మల్టీప్లెక్స్.. రూ.35.66 లక్షలు చెల్లించిన యాజమాన్యం
- ప్రభుత్వం జీఎస్టీని తగ్గించినా అధికంగా వసూలు చేసిన ఏఎంబీ సినిమాస్
- ప్రేక్షకుల నుంచి జీఎస్టీ రూపేణా రూ.రూ.35.66 లక్షలు వసూలు
- దాడి చేసి కేసు నమోదు చేయడంతో దిగొచ్చిన థియేటర్ యాజమాన్యం
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను ప్రభుత్వం తగ్గించినప్పటికీ ఆ మేరకు తగ్గించకుండా ప్రేక్షకుల నుంచి వసూలు చేస్తున్న నటుడు మహేశ్ బాబుకు చెందిన మల్టీప్లెక్స్ ఏఎంబీ సినిమాస్ వివాదంలో చిక్కుకుంది. ఈ థియేటర్‌పై దాడిచేసిన జీఎస్టీ అధికారులు.. జనవరి 1 నుంచి ఫిబ్రవరి ఐదో తేదీ వరకు పాత జీఎస్టీ ప్రకారమే ప్రేక్షకుల నుంచి వసూలు చేసినట్టు గుర్తించి కేసు నమోదు చేశారు. కాగా, ఇటీవల ప్రభుత్వం సినిమా టికెట్లను 28 శాతం పరిధి నుంచి 18 శాతం పరిధిలోకి తీసుకొచ్చి వినోద భారాన్ని తగ్గించింది.
దీంతో దిగొచ్చిన ఏఎంబీ సినిమాస్ యాజమాన్యం ప్రేక్షకుల నుంచి జీఎస్టీ రూపంలో అధికంగా వసూలు చేసిన రూ.35.66 లక్షలను చెల్లించింది. ఈ మొత్తాన్ని సంక్షేమ నిధికి జమ చేయనున్నట్టు అధికారులు తెలిపారు. అయితే, టికెట్ల అంశం రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ పరిధిలో ఉండడం వల్లే జీఎస్టీని తగ్గించలేదని థియేటర్ యాజమాన్యం పేర్కొంది. ఈ మేరకు హైదరాబాద్ జీఎస్టీ ప్రిన్సిపల్ కమిషనర్‌కు లేఖ రాసింది.