Narendra Modi: ప్రియమైన మోదీ.. మాటలతో సరిపెట్టొద్దు: స్వీడన్ బాలిక వీడియో సందేశం
- 16 ఏళ్ల పర్యావరణ వేత్త గ్రెటా
- ఐరాసలో తన ప్రసంగంతో ఆకట్టుకున్న స్వీడన్ బాలిక
- తాజాగా వీడియో సందేశం విడుదల
పర్యావరణ పరిరక్షణపై కేవలం మాటలకు మాత్రమే పరిమితమై చరిత్రలో ఘోరమైన ప్రతినాయకుడిగా మారొద్దంటూ స్వీడన్‌కు చెందిన 16 ఏళ్ల బాలిక పంపిన వీడియో సందేశం వైరల్ అవుతోంది. గతేడాది డిసెంబరులో ఐక్యరాజ్య సమితి పర్యావరణ మార్పుల సదస్సులో పాల్గొన్న బాలిక గ్రెటా థంబెర్గ్ తన ప్రసంగంతో అందరినీ ఆకట్టుకుంది. పర్యావరణ ఉద్యమకారిణిగా పేరు సంపాదించుకుంది.
తాజాగా, ప్రపంచ నేతలకు గ్రెటా ఓ వీడియో సందేశాన్ని పంపింది. ఇందులో భాగంగా భారత ప్రధాని మోదీ గురించి మాట్లాడుతూ.. ‘‘ప్రియమైన మోదీ.. పర్యావరణ పరిరక్షణపై మీరు మాటలకే పరిమితం కావడం ద్వారా భవిష్యత్ తరాలకు విలన్‌గా కనిపించొద్దు. మాటలతో సరిపెడుతూ చిన్న చిన్న విజయాలకే పొంగిపోవద్దు. అదే జరిగితే మీరు విఫలమవుతారు. మీరు విఫలమైతే చరిత్రలో ఘోరమైన విలన్‌గా మిగిలిపోతారు’’ అని ఆ వీడియో సందేశంలో పేర్కొంది.