security forces: కశ్మీర్ లో మరో భారీ ఉగ్రదాడికి స్కెచ్.. భద్రతా బలగాలకు నిఘా వర్గాల హెచ్చరిక!
- 500 కేజీల పేలుడు పదార్థాల వినియోగం
- స్కార్పియో కారును సిద్ధం చేసిన ఉగ్రవాదులు
- అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారుల ఆదేశం
పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై ఇటీవల జైషే మహమ్మద్ ఉగ్రవాది చేసిన ఆత్మాహుతి దాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత నిఘా వర్గాలు కీలక విషయాన్ని బయటపెట్టాయి. జైషే మహమ్మద్ సంస్థ మరోసారి భారీ ఉగ్రదాడికి ప్రణాళిక రచించినట్లు నిఘా వర్గాలు పోలీసులను హెచ్చరించాయి. కశ్మీర్ లో చౌకీబాల్ నుంచి తంగ్ధార్ వెళ్లే మార్గంలో భద్రతా బలగాలు లక్ష్యంగా రాబోయే రెండ్రోజుల్లో ఈ దాడి జరగొచ్చని తెలిపాయి. ఈ మేరకు తాము జైషే సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సందేశాలను డీకోడ్ చేసినట్లు పేర్కొన్నాయి.
మరో ఆత్మాహుతి దాడి కోసం ఉగ్రవాదులు ఆకుపచ్చ రంగు స్కార్పియో కారును సిద్ధం చేశారని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ఈ దాడిలో దాదాపు 500 కేజీల పేలుడు పదార్థాలను వాడనున్నట్లు చెప్పాయి. ‘ఇది కేవలం ఆరంభం మాత్రమే. గత వారం కేవలం 200 కిలోల ఐఈడీ మాత్రమే ఉపయోగించాం. 500 కిలోల భారీ బ్లాస్ట్‌కు సిద్ధంగా ఉండండి. కశ్మీరీలపై సైన్యం ఎటువంటి చర్యలకు పాల్పడ్డా.. భద్రతా బలగాలపై మరిన్ని దాడులు జరుగుతాయి.
ఇది కేవలం మనకు.. సైన్యానికి జరుగుతున్న యుద్ధం. రండి యుద్ధానికి సిద్ధంగా ఉండండి’ అని కశ్మీరీలకు జైషే పంపిన సందేశాన్ని డీకోడ్ చేసినట్లు ఇంటెలిజెన్స్ అధికారులు పేర్కొన్నారు. కాగా, ఇంటెలిజెన్స్ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని భద్రతా బలగాలను ఉన్నతాధికారులు ఆదేశించారు.