oar fish: ఈ చేపలు కనిపిస్తే అశుభమట.. మళ్లీ సునామీ, భూకంపం వస్తుందంటూ వణికిపోతున్న జపాన్ ప్రజలు!
- ఒకినవా ద్వీపంలో ఓర్ చేపల దర్శనం
- ప్రకృతి విపత్తులకు సూచికలుగా చేపలు
- జపాన్ వాసుల్లో భయం.. భయం
జపాన్ వాసులు ప్రస్తుతం భయంతో వణికిపోతున్నారు. మళ్లీ సునామీ లేదా భూకంపం తమ దేశాన్ని అతలాకుతలం చేస్తాయన్న భయంతో ఆందోళన చెందుతున్నారు. అయితే శాస్త్రవేత్తలు హెచ్చరించడం కారణంగానే వీరంతా భయపడుతున్నారని మీరు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే జపాన్ లో అరుదుగా కనిపించే ఓ చేపను చూసి వీరంతా ఏ ముప్పు వస్తుందోనని భయపడుతున్నారు.
జపాన్ లోని ఒకినవా ద్వీపం వద్ద గత నెల 28న రెండు ఓర్ చేపలు జాలర్ల వలలో చిక్కాయి. వీటిలో ఒకటి 12 అడుగులు ఉండగా, మరో చేప 13 అడుగుల పొడవుంది. అయితే వీటిని చూసిన జపనీయుల్లో మాత్రం కలవరం మొదలయింది. సాధారణంగా సునామీ, భూకంపం వంటి ప్రకృతి విపత్తులకు వీటిని సంకేతాలుగా జపాన్ లో భావిస్తారు.
సముద్రంలోని లోతట్టు ప్రాంతాల్లో నివసించే ఈ చేపలు ఉపద్రవాలు సంభవించే సమయంలోనే ప్రజలకు కనిపిస్తాయని నమ్ముతారు. దీంతో జపాన్ ప్రజల్లో ఇప్పుడు ఏం జరుగుతుందోనని గుబులు నెలకొంది. అయితే ఇవి కూడా సాధారణ చేపలేననీ, వీటికి ప్రత్యేకతలు ఆపాదించడం సరికాదని మరికొందరు వాదిస్తున్నారు.