Vikarabad District: రైతు కష్టాన్ని మింగేసిన సైబర్ నేరగాళ్లు!
- రైతు ఖాతా నుంచి రూ.4.34 లక్షలు విత్‌డ్రా
- పత్తిపంట సొమ్ము ఖాతాలో పడగానే మాయం
- మూడు అకౌంట్లలోకి బదిలీ అయినట్టు వెల్లడించిన బ్యాంకు సిబ్బంది
అడ్డగోలు సంపాదనకు అలవాటుపడిన సైబర్ నేరగాళ్లు ఓ అన్నదాత ఆరుగాలం శ్రమను దోచుకున్నారు. పత్తిపంట అమ్మగా వచ్చిన మొత్తం అతని అకౌంట్‌లోకి జమకాగానే అక్రమ మార్గంలో వేరే ఖాతాల్లోకి బదిలీచేసి నిలువునా ముంచేశారు. బాధితుని కథనం మేరకు... తెలంగాణలోని వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రేగడిమామిడిపల్లికి చెందిన కేశన్నగారి అమృతారెడ్డి పత్తిపంట సాగుచేశారు.
పంట చేతికి రావడంతో ఇటీవలే విక్రయించారు. పంట కొనుగోలు చేసిన వ్యాపారి రెండు రోజుల క్రితం అతని ఖాతాలోకి 4 లక్షల 34 వేల రూపాయలు జమ చేశాడు. మంగళవారం అమృతారెడ్డి సెల్‌ఫోన్‌కు అతని ఖాతా నుంచి డబ్బు విత్ డ్రా చేస్తున్నట్లు పలుమార్లు మెసేజ్‌లు వచ్చాయి. దీంతో అనుమానం వచ్చిన అమృతారెడ్డి తన బ్యాంకు ఖాతా ఉన్న చన్‌గోముల్ స్టేట్ బ్యాంక్ శాఖకు వెళ్లి వివరాలు కనుక్కున్నాడు.
అతని ఖాతా నుంచి పేటీఎం, ఓలా క్యాబ్స్, అమెజాన్‌కు డబ్బు బదిలీ అయినట్టు అక్కడి సిబ్బంది చెప్పడంతో అమృతారెడ్డి షాక్ అయ్యారు. సైబర్ నేరగాళ్లు అమృతారెడ్డి బ్యాంకు ఖాతా వ్యక్తిగత వివరాలను ఇంతకు ముందే సేకరించి డబ్బు పడగానే బురిడీ కొట్టించినట్టు బ్యాంకు అధికారులు అనుమానిస్తున్నారు. మోసపోయానని గుర్తించిన అమృతారెడ్డి జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.