USA: సిగరెట్లు తాగితే కళ్లు పోతాయట... సరికొత్త అధ్యయనం!
- రోజుకు 20 సిగరెట్లు మించితే అంధత్వం
- రంగులు గుర్తించలేరు
- రట్జర్స్ వర్శిటీ పరిశోధకుల వెల్లడి
పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం అని ఎన్ని ప్రకటనలు గుప్పించినా ధూమపానం చేసేవాళ్లలో పెద్దగా మార్పు కనిపించదు. వాళ్లకై వాళ్లు అనారోగ్యం బారినపడి పొగ తాగలేని స్థితికి వస్తే తప్ప ఆ వ్యసనానికి అడ్డుకట్ట పడదు. ఇప్పటి సంస్కృతిలో చిన్న వయసులోనే కొందరు స్మోకింగ్ కు అలవాటు పడుతున్నారు. టీనేజర్లు సైతం చేతిలో సిగరెట్ తో దర్శనమిస్తున్న సంఘటనలు కోకొల్లలు. మితిమీరి పొగ తాగడం వల్ల ప్రధానంగా ఊపిరితిత్తులు దెబ్బతింటాయని, క్యాన్సర్ కూడా వస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తుంటారు. అయితే చైన్ స్మోకర్లకు ఇవే కాక మరో ప్రధానమైన ముప్పు ఉందని, రోజుకు 20కి మించి సిగరెట్లు ఊదిపారేసే వాళ్లలో అంధత్వం వస్తుందని తాజాగా ఓ పరిశోధన చెబుతోంది.
న్యూజెర్సీలోని రట్జర్స్ యూనివర్శిటీ పరిశోధకుల బృందం నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాన్ని గుర్తించారు. అంతేకాదు, ఓవర్ స్మోకింగ్ కారణంగా వ్యక్తులు రంగులను గుర్తించే సామర్థ్యాన్ని కోల్పోతారట. గతంలో నిర్వహించిన కొన్ని పరిశోధనలు కూడా కంటికి సంబంధించిన సమస్యలు వస్తాయని తెలిపాయి. కంటి కటకం పసుపు రంగులోకి మారిపోవడమే కాకుండా వాపు కూడా కనిపిస్తుందని గుర్తించారు. తాజా పరిశోధన కోసం 25 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తుల నుంచి రోజుకు 15 కంటే తక్కువ సిగరెట్లు తాగే 71 మంది ఆరోగ్యవంతులను, రోజుకు 20 కంటే ఎక్కువ సిగరెట్లు తాగే 63 మందిని తీసుకున్నారు.